Electric Vehicles : ఇండియాలో ఈవీ విప్లవం.. టాటా, టీవీఎస్‌ల దెబ్బకు రికార్డులు బద్ధలు.

Update: 2026-04-08 10:00 GMT

Electric Vehicles : భారతదేశ రహదారులపై నిశ్శబ్ద విప్లవం మొదలైంది. పెట్రోల్, డీజిల్ శబ్దాలు తగ్గి.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (FY26) భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో ఈవీల అమ్మకాలు ఏకంగా 24.6 శాతం వృద్ధిని నమోదు చేసి, 24.52 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. టూ-వీలర్ల నుంచి భారీ కమర్షియల్ వాహనాల వరకు అన్ని విభాగాల్లోనూ ఈ ఎలక్ట్రిక్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.

టూ-వీలర్ల విభాగంలో టీవీఎస్ హవా

ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విభాగం ఊహించని రీతిలో దూసుకుపోతోంది. గత ఏడాది 11.50 లక్షలుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 14.01 లక్షలకు చేరాయి. ఈ విభాగంలో 3.41 లక్షల యూనిట్ల అమ్మకాలతో టీవీఎస్ అగ్రస్థానంలో నిలవగా, బజాజ్ ఆటో రెండో స్థానంలో, ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో నిలిచాయి. ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ స్కూటర్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ కింగ్

ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ (కార్ల) విభాగంలో దాదాపు 83.63 శాతం భారీ వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష దాటని అమ్మకాలు, ఈసారి ఏకంగా 1.99 లక్షల యూనిట్లకు చేరువయ్యాయి. ఇందులో టాటా మోటార్స్ దాదాపు 78 వేల కార్లను విక్రయించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రా కంపెనీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్త మోడళ్ల రాకతో మధ్యతరగతి ప్రజలు కూడా ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

త్రీ-వీలర్లు, కమర్షియల్ వాహనాలు

ఆటో రిక్షాల విభాగంలో కూడా ఈవీల జోరు తగ్గలేదు. సుమారు 18.97 శాతం వృద్ధిలో 8.30 లక్షల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు అమ్ముడయ్యాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం కమర్షియల్ వాహనాల విభాగమే. ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాల్లో ఏకంగా 120.57 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది కేవలం 8 వేల యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య 19,454 యూనిట్లకు చేరడం విశేషం.

ఎనర్జీ ట్రాన్సిషన్ దిశగా అడుగులు

ఫాడా (FADA) ప్రెసిడెంట్ సిఎస్ విఘ్నేశ్వర్ అభిప్రాయం ప్రకారం, ఈ పెరుగుదల కేవలం అమ్మకాలకే పరిమితం కాదు. ఇది భారతదేశం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వైపు మారుతున్న విధానానికి నిదర్శనం. చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరగడం, బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడటం వల్ల ప్రజల్లో ఉన్న భయాలు తొలగిపోతున్నాయి. రాబోయే కాలంలో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News