Maruti e Vitara : మేడ్ ఇన్ ఇండియా పవర్.. ఆస్ట్రేలియాలో గర్జించిన మారుతి ఈ-విటారా.

Update: 2026-04-08 09:30 GMT

Maruti e Vitara : భారతదేశంలో తయారై ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ మేడ్ ఇన్ ఇండియా కారు తన సత్తా చాటింది. ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించిన సేఫ్టీ టెస్టుల్లో ఈ-విటారాకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కింది. సుమారు 200 దేశాలకు ఎగుమతి కానున్న ఈ కారు, అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఏమాత్రం తగ్గనని నిరూపించింది. ANCAP నివేదిక ప్రకారం.. మారుతి ఈ-విటారా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 77 శాతం, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 87 శాతం స్కోరు సాధించింది. అలాగే పాదచారుల భద్రత విషయంలో 79 శాతం, సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లలో 71 శాతం మార్కులు దక్కించుకుంది. 5-స్టార్ రేటింగ్ తృటిలో తప్పినప్పటికీ, అంతర్జాతీయంగా కఠినమైన పరీక్షల్లో 4-స్టార్ సాధించడం అంటే ఇది ఒక గొప్ప విజయంగానే పరిగణించవచ్చు. ఈ రేటింగ్ ఈ-విటారాలోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

ఈ-విటారాలో సేఫ్టీకి పెద్దపీట వేశారు. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ చెస్ట్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు, హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు డ్రైవర్ మోకాళ్ల కోసం ప్రత్యేకంగా ఎయిర్‌బ్యాగ్‌ను అందించారు. వీటితో పాటు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ సపోర్ట్ ఫీచర్లు, స్పీడ్ సైన్ రికగ్నిషన్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌గా వస్తాయి. విశేషమేమిటంటే, భారత దేశంలో నిర్వహించిన BNCAP టెస్టుల్లో ఈ కారుకు ఏకంగా 5-స్టార్ రేటింగ్ లభించింది.

ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 49kWh బ్యాటరీ ప్యాక్, ఇది 144hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 440 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక రెండోది 61kWh భారీ బ్యాటరీ ప్యాక్, ఇది 174hp పవర్‌ను అందిస్తూ ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తాయి. ఈ-విటారా కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, ఇది పర్ఫార్మెన్స్ విషయంలోనూ అద్భుతంగా ఉంటుంది.

భారత మార్కెట్లో మారుతి ఈ-విటారా ప్రారంభ ధర సుమారు 10.99 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంది. ఇందులో బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) ఆప్షన్ కూడా ఉండటం వల్ల కస్టమర్లకు కొనుగోలు చేయడం మరింత సులభం అవుతుంది. మన దేశంలోని ప్లాంట్‌లో తయారైన ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల రోడ్లపై పరుగులు తీయబోతున్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్, టాప్ క్లాస్ సేఫ్టీ కావాలనుకునే వారికి ఈ-విటారా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags:    

Similar News