Car Paint Rules : జాగ్రత్త సుమా ! మీ కారుకు ఈ రంగు వేస్తే జైలు గ్యారెంటీ.. పోలీసులు కారును లాక్కెళ్లిపోతారు.
Car Paint Rules : భారతదేశంలో కార్ల పిచ్చి ఉన్నవారికి కొదవలేదు. మార్కెట్లో రకరకాల రంగులు, డిజైన్లలో కార్లు అందుబాటులో ఉన్నాయి. కొందరు తమకు నచ్చిన రంగును కారుకు వేయించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే, మీరు కోటీశ్వరులైనా సరే.. మీ సొంత కారుకు ఒక ప్రత్యేకమైన రంగును వేయడం భారతదేశంలో నేరం. భారతీయ రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం.. సామాన్య పౌరులు తమ వాహనాలకు ఆలివ్ గ్రీన్ రంగును వేయడం చట్టరీత్యా నేరం. కేంద్ర మోటారు వాహనాల నియమావళి 1989, సెక్షన్ 121(1) ప్రకారం, ఈ రంగు కేవలం భారత రక్షణ శాఖ (డిఫెన్స్ ఫోర్స్) వాహనాలకు మాత్రమే కేటాయించబడింది. అత్యవసర సమయాల్లో లేదా యుద్ధ కాలంలో సైనిక వాహనాలను సులభంగా గుర్తించడానికి, సామాన్య వాహనాల నుంచి వాటిని వేరుగా చూపడానికి ఈ నిబంధన పెట్టారు. ఒకవేళ ఎవరైనా ఈ రంగును తమ ప్రైవేట్ కార్లకు వేయిస్తే, పోలీసులు ఆ వాహనాన్ని తక్షణమే జప్తు చేస్తారు.
రంగు మార్చాలంటే రూల్స్ ఇవే
చాలామంది తమ కారు పాతబడిందని లేదా బోర్ కొట్టిందని రంగు మార్చాలని అనుకుంటారు. కానీ, కారు పెయింట్ మార్చడం అంటే కేవలం రంగు వేయడం మాత్రమే కాదు. దీనికి ఒక చట్టపరమైన ప్రక్రియ ఉంటుంది. మీరు మీ కారు రంగు మార్చాలనుకుంటే మొదట మీ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే పెయింట్ వేయించాలి. ఆ తర్వాత మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో కొత్త రంగును అప్‌డేట్ చేయించాలి. ఈ ప్రాసెస్ లేకుండా రంగు మారిస్తే భారీ జరిమానా విధిస్తారు, చివరకు మీ కారు రిజిస్ట్రేషన్ కూడా రద్దు కావచ్చు.
సైనిక వాహనాల ప్రత్యేకత
భారత సైన్యంలో ఇప్పుడు అత్యున్నత ప్రమాణాలు కలిగిన వాహనాలు ఉన్నాయి. టాటా సఫారీ, మారుతి జిప్సీ వంటి క్లాసిక్ వాహనాలతో పాటు.. ఇప్పుడు టయోటా హిలక్స్, మారుతి జిమ్నీ, మహీంద్రా స్కార్పియో వంటి పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు సైన్యం అమ్ములపొదిలో చేరాయి. ఇవన్నీ ఆలివ్ గ్రీన్ రంగులోనే ఉంటాయి. కొన్ని కంపెనీలు సామాన్యుల కోసం గ్రీన్ షేడ్స్ ఇస్తున్నప్పటికీ, అవి ఆర్మీ వాడే ఆలివ్ గ్రీన్ కంటే భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడతాయి.
శిక్షలు, జరిమానాలు
ఒకవేళ మీరు ఆలివ్ గ్రీన్ రంగు వేయించినా లేదా ఆర్టీఓ అనుమతి లేకుండా రంగు మార్చినా పోలీసుల కళ్లు కప్పడం సాధ్యం కాదు. ట్రాఫిక్ పోలీసులు కారును సీజ్ చేయడమే కాకుండా, కారు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఆర్టీఓ అధికారులు రంగును తిరిగి మార్చమని ఆదేశించడమే కాకుండా వేల రూపాయల ఫైన్ వసూలు చేస్తారు. కాబట్టి ఫ్యాషన్ కోసం వెళ్లి అనవసరమైన చిక్కుల్లో పడకండి.