అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం
అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్టు జెఫ్ బెజోస్ ప్రకటించారు.;
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని జెఫ్ బెజోస్ స్వయంగా అనౌన్స్ చేశారు. తన నిర్ణయంపై ఉద్యోగులకు లేఖ కూడా రాశారు. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడం ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. బెజోస్ నిర్ణయంతో అమెరికా వ్యాపారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
1994లో అమెజాస్‌ను స్థాపించారు బెజోస్. మొదట్లో ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలు అమ్మేందుకు అమెజాన్‌ను ప్రారంభించారు. తరువాత అంచెలంచెలుగా ఎదిగిన అమెజాన్.. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్‌గా ఎదిగింది అమెజాన్. ఈ కంపెనీయే జెఫ్ బెజోస్‌ను ప్రపంచ కుబేరుడిగానూ నిలబెట్టింది. ప్రస్తుతం అమెజాన్ విలువ దాదాపు లక్షన్నర కోట్ల డాలర్ల పైమాటే.
సీఈఓగా తప్పుకోనున్న జెఫ్ బెజోస్.. అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీని సీఈవోగా నియమించనున్నారు. బెజోస్ ఇకపై అమెజాన్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
అమెజాన్ సీఈఓగా తప్పుకుంటున్న బెజోస్.. సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ దాతృత్వంలోనూ ముందున్నారు. కరోనా సమయంలో భారీ వితరణలతో జెఫ్ బెజోస్ అందరికీ స్ఫూర్తిగా నింపారు. వాతావరణ మార్పుల అంశంలో పోరాటానికి గాను.. బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా 16 సంస్థలకు దాదాపు 790 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. 2020లో వాతావరణ మార్పుల విభాగం కోసం 10 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్టు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ తెలిపింది.