Yezdi : రాయల్ ఎన్‌ఫీల్డ్ కు గట్టి పోటీ.. యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఫీచర్లు, ధరలివే.

Update: 2026-03-03 09:30 GMT

Yezdi : బైక్ లవర్స్‎కు ఒక క్రేజీ అప్‌డేట్. క్లాసిక్ లెజెండ్స్ సంస్థ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం సందర్భంగా తన పవర్‌ఫుల్ బైక్ యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 1970ల నాటి క్లాసిక్ యెజ్డీ బైక్‌ల డిజైన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ రెడ్ వోల్ఫ్ ఎడిషన్, తన అదిరిపోయే లుక్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2,09,950 గా నిర్ణయించారు. ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే.. ఇది మెరిసే ముదురు ఎరుపు రంగులో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇంజన్, ఎగ్జాస్ట్ పైపులు, హ్యాండిల్‌బార్‌పై క్రోమ్ ఫినిషింగ్‌ను ఇచ్చి వింటేజ్ లుక్ తీసుకొచ్చారు. రోడ్‌స్టర్ మోడల్‌కు ఉండే మజిల్ ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి రియర్ ఫెండర్, బాబర్-స్టైల్ సీటింగ్ ఈ బైక్ సొంతం. ఇందులో బ్రౌన్ కలర్ సీటును అమర్చారు. అవసరాన్ని బట్టి దీనిని సింగిల్ సీటుగా లేదా వెనుక కూర్చునే వారితో (పిలియన్) కలిపి వాడుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో అత్యంత వెడల్పాటి వెనుక టైరు కలిగిన బైక్ ఇదేనని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇందులో స్టాండర్డ్ రోడ్‌స్టర్‌కు ఉండే 350 Alpha2 లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 29 bhp పవర్‌ను, 29.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్‌ను సులభతరం చేసేందుకు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్‌ను కూడా అందించారు. సేఫ్టీ కోసం ముందు వైపు 320 mm డిస్క్, వెనుక 240 mm డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS (Continental నుంచి తీసుకున్నది) సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు కాగా, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్ లో రాజీ పడలేదు. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ లాంగ్ జర్నీలలోనూ సౌకర్యాన్ని అందిస్తాయి. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 171 mm ఉండగా, సీటు ఎత్తు 795 mm గా ఉంది. అంటే తక్కువ ఎత్తు ఉన్న వారు కూడా దీనిని సులభంగా నడపవచ్చు. ఎల్ఈడీ లైట్లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. ఈ బైక్‌పై కంపెనీ 4 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. అంతేకాదు, 5 ఏళ్ల మెయింటెనెన్స్ ప్లాన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మార్కెట్లో ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350, హోండా హైనెస్ CB350 మరియు జావా 42 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Tags:    

Similar News