Suzuki EV : సుజుకి అదిరిపోయే ప్లాన్.. ఇక ఈ-స్కూటర్ కొనక్కర్లేదు, అద్దెకు తీసుకుంటే చాలు.

Update: 2026-03-03 09:15 GMT

Suzuki EV : ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకునే వారికి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అదిరిపోయే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. భారీ మొత్తం వెచ్చించి స్కూటర్ కొనడం ఇష్టం లేని వారు లేదా కొన్ని రోజులు మాత్రమే వాడాలనుకునే వారి కోసం ఫ్లెక్సిబుల్ రెంటల్ అండ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందుకోసం ప్రముఖ రెంటల్ సంస్థ రాయల్ బ్రదర్స్‎తో సుజుకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త ప్లాన్ సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ తో మొదలుపెట్టడం విశేషం.

ఈ ఒప్పందం ప్రకారం కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా కేవలం 24 గంటల నుంచి ఏడాది వరకు ఈ స్కూటర్‌ను అద్దెకు తీసుకోవచ్చు లేదా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సిటీలో కొత్తగా వచ్చే వారు, ఆఫీస్ అవసరాలకు వెహికల్ కావాలనుకునే వారు లేదా ఈవీ స్కూటర్‌ను కొనే ముందు దాని పర్ఫామెన్స్ టెస్ట్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూటర్ మీ సొంతం కాకపోయినా, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకునే వెసులుబాటు ఈ ప్లాన్ కల్పిస్తుంది.

ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, జైపూర్, గురుగ్రామ్‌లలో కస్టమర్లు రాయల్ బ్రదర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సుజుకి తన పోర్ట్‌ఫోలియోలోని మరిన్ని మోడళ్లను ఈ సబ్‌స్క్రిప్షన్ లిస్ట్‌లో చేర్చే అవకాశం ఉంది. అయితే, అద్దె ధరలు ఎంత ఉంటాయనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

సుజుకి ఈ-యాక్సెస్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,08,490 నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 4.1 కిలోవాట్ పవర్ ఇచ్చే మోటార్‌ను అమర్చారు. 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కనెక్టెడ్ ఫీచర్స్ ఈ స్కూటర్ ప్రత్యేకం. మార్కెట్లో ఇది బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Tags:    

Similar News