Mukesh Ambani : చాట్ జిపిటి కి చెక్..ముఖేష్ అంబానీ మేడ్ ఇన్ ఇండియా AI ప్లాన్‌తో ప్రపంచం షాక్!
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత డిజిటల్ రంగంలో మరో విప్లవానికి తెరలేపారు. వైబ్రెంట్ గుజరాత్ 2026 వేదికగా ఆయన చేసిన ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. టెక్నాలజీ రంగంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా ముఖేష్ అంబానీ సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రిలయన్స్ జియో త్వరలోనే దేశంలోనే మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతోంది. ఇది కేవలం టెక్ నిపుణుల కోసం మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూపొందించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ పీపుల్-ఫస్ట్ అనే ఆలోచనతో వస్తోంది. అంటే సామాన్యుడు తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు AI ద్వారా పరిష్కారాలను వెతకవచ్చు. అది కూడా మన సొంత భాషల్లోనే అందుబాటులో ఉండటం విశేషం.
ఈ సరికొత్త AI సేవలకు పునాదిగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారత్ లోనే అతిపెద్ద AI-రెడీ డేటా సెంటర్‌ను రిలయన్స్ నిర్మిస్తోంది. దీనివల్ల AI సేవలు అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో సామాన్యులకు చేరువవుతాయి. తొలుత గుజరాత్‌లో ప్రారంభమయ్యే ఈ సేవలు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. AI అనేది కేవలం ధనికులకో, చదువుకున్న వారికో పరిమితం కాకుండా.. ప్రతి భారతీయుడి చేతిలోకి చేరాలనేది అంబానీ లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఆయన కొనియాడారు. రాబోయే 50 ఏళ్ల భారత భవిష్యత్తును ప్రధాని అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
గుజరాత్ అంటే రిలయన్స్‌కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అది వారి గుండెకాయ అని అంబానీ భావోద్వేగంగా చెప్పారు. అందుకే గత ఐదేళ్లలో అక్కడ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా, రాబోయే ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.7 లక్షల కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా, క్లీన్ ఎనర్జీ రంగంలో కూడా జామ్‌నగర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద హబ్‌గా మారుస్తున్నారు. సౌర శక్తి, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ వంటి అత్యాధునిక రంగాల్లో రిలయన్స్ దూసుకుపోతోంది. కచ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే భారీ సోలార్ ప్రాజెక్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది.
రిలయన్స్ తన సామాజిక బాధ్యతను కూడా మరువలేదు. జామ్‌నగర్‌లో ప్రపంచ స్థాయి ఆసుపత్రి, విద్యా సదుపాయాలను మరింత విస్తరించనున్నారు. అలాగే, నరణపురలో ఉన్న వీర సావర్కర్ మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణను కూడా రిలయన్స్ చేపట్టనుంది. 2036లో భారత్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుందని అంబానీ స్పష్టం చేశారు. క్రీడలు, విద్య, వైద్య రంగాల్లో గుజరాత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడమే తన తదుపరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.