Mahindra : మహీంద్రా రికార్డు..ప్రతి 10 నిమిషాలకు ఒక ఎస్‌యూవీ సేల్..7 నెలల్లో ఎన్ని అమ్మిందంటే ?

Update: 2025-11-27 09:30 GMT

Mahindra : భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో చెప్పడానికి మహింద్రా సాధించిన రికార్డే అతి పెద్ద ఉదాహరణ. కంపెనీ కేవలం 7 నెలల స్వల్ప వ్యవధిలో 30,000 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించి ఒక మైలురాయిని చేరుకుంది. దీని అర్థం మహీంద్రా ప్రకారం.. ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అమ్ముడవుతోంది. ఈ ఘనత మహింద్రా ఈవీ వ్యూహానికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది. గత నవంబర్‌లో లాంచ్ అయిన XEV 9e, BE 6 మోడళ్లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు మోడళ్లు బ్రాండ్‌కు సరికొత్త కస్టమర్లను తీసుకురావడంలో సఫలీకృతమయ్యాయి.

మహింద్రా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారిలో దాదాపు 80% మంది ఇంతకు ముందు ఎప్పుడూ మహీంద్రా కారును కొనుగోలు చేయని కొత్త కస్టమర్లు ఉండడం విశేషం. అంటే ఈ ఈవీ మోడళ్లు ఒక కొత్త మార్కెట్ విభాగాన్ని తెరిచాయి. కొత్త కస్టమర్ వర్గానికి మహీంద్రాపై నమ్మకాన్ని పెంచాయి. అంతేకాక కంపెనీ ఈవీ లైనప్‌లోని దాదాపు 65 శాతం యూనిట్లు ప్రతి పని దినం రోడ్లపై కనిపిస్తున్నాయి. దీనిని బట్టి, కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ కార్లను కేవలం సెకండరీ వాహనంగా కాకుండా రోజువారీ ప్రయాణాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ గణాంకాలు దేశంలో ఈవీలకు పెరుగుతున్న ఆదరణను మరింత బలోపేతం చేస్తున్నాయి.

భారతీయ ఈవీ మార్కెట్‌లో ఇప్పటికే బలమైన స్థానంలో ఉన్న మహీంద్రా, ఇప్పుడు తమ ప్రణాళికలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. బెంగళూరులో జరిగిన స్క్రీమ్ ఎలక్ట్రిక్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ పలు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ఫార్ములా Eలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. XEV 9S ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌ను ప్రదర్శించింది. అనేక కొత్త EV-కేంద్రీకృత కాన్సెప్ట్‌లు, థీమ్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ పరిణామాలు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో మహీంద్రా కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీ, ప్రపంచవ్యాప్త బ్రాండ్ స్థానాన్ని పెంచడానికి కృషి చేస్తోందని సూచిస్తున్నాయి.

Tags:    

Similar News