UPI : పిన్ నంబర్ చికాకుకు చెక్..యూపీఐ పేమెంట్ ఇక ఫేస్, ఫింగర్ ప్రింట్‌తోనే.. ఎలా పనిచేస్తుందంటే?

Update: 2025-10-08 05:00 GMT

UPI : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సర్వీసులో నేటి (అక్టోబర్ 8) నుంచి ఒక కీలకమైన మార్పు అమలులోకి రాబోతోంది. యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించేటప్పుడు పిన్ నంబర్ ఎంటర్ చేయడం ఇబ్బందిగా భావించే వారికి ఈ కొత్త ఫీచర్ ద్వారా పెద్ద ఉపశమనం లభించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రెజరీ ట్రాన్సాక్షన్‌ల వెరిఫికేషన్ ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై యూపీఐ పేమెంట్లను పిన్ నంబర్‌తో పాటు బయోమెట్రిక్ పద్ధతిలో కూడా పూర్తి చేయవచ్చు.

ప్రస్తుతం యూపీఐ లైట్ ద్వారా చిన్న మొత్తంలో డబ్బు చెల్లిస్తే తప్ప, మిగతా అన్ని ట్రాన్సాక్షన్‌లకు పిన్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి వస్తోంది. అయితే ఇకపై యూపీఐ యూజర్లు ఫేస్, వేలిముద్ర వంటి బయోమెట్రిక్ విధానాలను ఉపయోగించి కూడా ట్రాన్సాక్షన్‌లను కన్ఫర్మ్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ యూపీఐ పేమెంట్‌లకు మరింత సేఫ్టీ కల్పించడంతో పాటు, సమయాన్ని ఆదా చేస్తుంది.

యూపీఐలో ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ ఆధార్ వ్యవస్థ ఆధారంగా పనిచేయనుంది. దీని కోసం యూపీఐ యూజర్లు తమ ఆధార్ కార్డును యూపీఐకి లింక్ చేయాల్సి ఉంటుంది. యూజర్ల ఫేస్, వేలిముద్రలు డేటా ఆధార్ ఫ్రేమ్‌వర్క్‌లో స్టోర్ చేయబడి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు ధృవీకరణ కోసం ఈ బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డెవలప్ చేసిన యూపీఐ పేమెంట్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇది భారతదేశం సొంతంగా నిర్మించిన ప్రత్యేక టెక్నాలజీ. ఇతర దేశాలలో ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్‌లు ఉన్నప్పటికీ, అన్ని పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను యూపీఐ ద్వారా అనుసంధానం చేసిన ఏకైక వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవ్‌లో యూపీఐ ఈ బయోమెట్రిక్ ఫీచర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మరిన్ని దేశాలు యూపీఐని స్వీకరించడానికి ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News