Edible Oils : పామాయిల్‌కు బై బై.. సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల కోసం ఎగబడుతున్న జనం.
Edible Oils : చలికాలం వచ్చిందంటే చాలు వంట నూనెల వినియోగంలో భారీ మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మునపటి కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పామాయిల్ త్వరగా గడ్డకట్టడం, ఆరోగ్యానికి అంత మంచిది కాదనే భావనతో చాలామంది సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. SEA గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 2025లో పామాయిల్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గి 5.07 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి.
పామాయిల్ క్రేజ్ తగ్గుతుంటే.. మరోవైపు సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెల డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. డిసెంబర్ నెలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 32 శాతం పెరిగి 3.49 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అలాగే సోయాబీన్ నూనె దిగుమతులు కూడా 20 శాతం వృద్ధితో 5.05 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ప్రపంచంలోనే వంట నూనెల అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్, డిసెంబర్ 2024లో 12.75 లక్షల టన్నుల నూనెను కొనుగోలు చేయగా, ఈ ఏడాది అది 13.83 లక్షల టన్నులకు పెరిగింది. అంటే ప్రజలు నూనె వాడకాన్ని తగ్గించలేదు కానీ, తమకు నచ్చిన రకాన్ని మాత్రం మార్చుకున్నారు.
మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా నూనె గింజల సాగు కూడా ఊపందుకుంది. జనవరి 2 నాటికి రబీ కాలం నూనె గింజల సాగు విస్తీర్ణం 3 శాతం పెరిగి 99.30 లక్షల హెక్టార్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 93.27 లక్షల హెక్టార్లుగా మాత్రమే ఉంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, మన దేశంలో రైతులు పండించే పంటల ద్వారా నిల్వలు పెరగడం సానుకూల పరిణామం. ప్రస్తుతం దేశంలో 17.50 లక్షల టన్నుల వంట నూనె నిల్వలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా పామాయిల్ ధర తక్కువగా ఉండటం వల్ల సామాన్యులు దీనిని ఎక్కువగా వాడేవారు. అయితే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది. గుండె ఆరోగ్యానికి సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెలు మేలని భావిస్తుండటంతో, ధర కొంచెం ఎక్కువైనా వాటినే ఎంచుకుంటున్నారు. హోటళ్లు, వాణిజ్య అవసరాలకు ఇప్పటికీ పామాయిల్ వాడుతున్నా, గృహ అవసరాలకు మాత్రం ఇతర నూనెలే రారాజుగా మారుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో పామాయిల్ మార్కెట్ వాటా మరింత తగ్గే అవకాశం ఉంది.