Maruti Suzuki Dzire : 33.7 కి.మీ మైలేజ్.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్..మారుతి డిజైర్ పై భారీ డిస్కౌంట్.
Maruti Suzuki Dzire : పండుగ సీజన్‌లో తమ అమ్మకాలను పెంచడానికి ఆటోమొబైల్ కంపెనీలు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత కార్ల ధరలు తగ్గడం, కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో కార్ల అమ్మకాలు పెరిగాయి. అయితే, సెప్టెంబర్‌లో మారుతి సుజుకి కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో మీకు తెలుసా? ఆ కారు మారుతి డిజైర్. ఈ కారు అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 85 శాతం పెరిగాయి, అంతేకాకుండా దీని ధర రూ.88,000 వరకు తగ్గింది.
మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు సెప్టెంబర్ 2025లో ఊహించని విధంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కారు 10,853 యూనిట్లు అమ్ముడైతే, ఈ సంవత్సరం అమ్మకాలు ఏకంగా 85 శాతం పెరిగి 20,038 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారీ ధర తగ్గింపు, పండుగ సీజన్ ఆఫర్ల కారణంగా డిజైర్ మారుతి కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ.58,000 నుంచి గరిష్టంగా రూ.88,000 వరకు తగ్గాయి. డిజైర్ కారు మాన్యువల్, ఏఎమ్‌టీ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉంది. ఏఎమ్‌టీ వేరియంట్ల ధర రూ.72,000 నుంచి రూ.88,000 వరకు తగ్గింది.
మాన్యువల్ వేరియంట్ల ధర రూ.58,000 నుంచి రూ.72,000 వరకు తగ్గింది. ఈ ధర తగ్గింపులతో డిజైర్ కారును సొంతం చేసుకోవడం వినియోగదారులకు మరింత సులువైంది. మారుతి డిజైర్ 1.2 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది మైలేజ్, సేఫ్టీలో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ లీటరుకు 24.79 కి.మీ, పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ లీటరుకు 25.71 కి.మీ, సీఎన్‌జీ (CNG) వేరియంట్ కిలోకు 33.7 కి.మీ మైలేజీ ఇస్తుంది.
ఈ కారు GNCAP, భారత్ NCAP క్రాష్ టెస్టులలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. అంటే, ఈ కారు సేఫ్టీ విషయంలో అత్యంత సురక్షితమైనదిగా నిరూపించుకుంది. మారుతి డిజైర్‌కు మార్కెట్‌లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. కానీ, అమ్మకాల విషయంలో డిజైర్ వాటికి అందనంత ఎత్తులో ఉంది.