Maruti : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వస్తున్న మారుతి.. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ డేట్ ఫిక్స్.

Update: 2025-11-17 10:15 GMT

Maruti : గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల రంగం అనేక రెట్లు పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు బడ్జెట్-ఫ్రెండ్లీ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటి వరకు ఈ విభాగంలో లేదు. కానీ ఆ నిరీక్షణకు తెరపడింది. మారుతి సుజుకి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా అధికారికంగా డిసెంబర్ 2, 2025 న భారతదేశంలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ద్వారా ఈవీ కస్టమర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ-విటారా రాక 2030 నాటికి ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో 50 శాతం వాటాను దక్కించుకోవాలనే మారుతి సుజుకి వ్యూహంలో భాగం. ఈ కారు కొత్తగా రూపొందించబడిన HEARTECT-e ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంది. భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత ఈ-విటారా 61 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పెద్ద బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ వరకు రేంజ్‌ను అందించగలదని అంచనా. ఇండియన్-స్పెక్ మోడల్‌లో ఆల్-వీల్ డ్రైవ్, డ్యుయల్-మోటార్ వెర్షన్ ఉండకపోవచ్చు. బదులుగా సింగిల్ eAXLE తో ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్ లభిస్తుంది.

ఈ-విటారా పూర్తిగా కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనంగా అభివృద్ధి చేశారు. మాస్ ఈవీ మార్కెట్‌ను ఆకర్షించే మీడియం రేంజ్ ఎస్‌యూవీ ఆకారాన్ని కలిగి ఉంది. ముందు భాగంలో 3-పాయింట్ మ్యాట్రిక్స్ LED DRLలతో కూడిన ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. గాలిని సమర్థవంతంగా వినియోగించుకునే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో సైడ్ ప్రొఫైల్ మరింత మెరుగ్గా కనిపిస్తుంది. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్ ఉండి, మొత్తం డిజైన్ చాలా నేచురల్ గా ఉంటుంది.

మారుతి మొట్టమొదటి ఈవీ కేబిన్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. ఇది విశాలమైన డిజైన్, డ్యూయల్-టోన్ థీమ్, ట్విన్-డెక్ ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా డ్యూయల్ స్క్రీన్ డిజిటల్ కాక్‌పిట్, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అధునాతన సౌకర్యాలు లభిస్తాయి.

కొత్త మారుతి సుజుకి ఈవీ సేఫ్టీ విషయంలో కూడా అత్యధిక స్కోర్‌ను సాధించనుంది. ఇందులో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ సూట్ లభిస్తుంది. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇందులో డ్రైవర్ మోకాలి ఎయిర్‌బ్యాగ్ కూడా ఉంది. ఇది బ్రాండ్‌లో మొదటిసారి అందించబడుతున్న ఫీచర్. ABS, EBD, ESC వంటి అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ-విటారా 10 వేర్వేరు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో నాలుగు డ్యూయల్-టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News