Bank Scam : బ్యాంకింగ్ రంగంలో కలకలం..ప్రభుత్వ ఖాతాలకే కన్నం వేసిన కిలాడీలు..ఐడీఎఫ్‌సీలో ఏం జరిగింది?
Bank Scam : చండీగఢ్‌లోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రధాన శాఖలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.590 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించి మరీ విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ డబ్బంతా హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాల నుంచి మాయమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ స్కామ్ ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్ వల్ల బయటపడలేదు, ప్రభుత్వం తన ఖాతాలను క్లోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు అసలు విషయం వెలుగు చూసింది.
ఈ నెల 18వ తేదీ నుంచి హర్యానా ప్రభుత్వానికి చెందిన కొన్ని విభాగాలు తమ ఖాతాలను చండీగఢ్ ఐడీఎఫ్‌సీ శాఖ నుంచి వేరే బ్యాంకుకు మార్చాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా అధికారులు బ్యాంకును సంప్రదించి, తమ నిధులను ట్రాన్స్ ఫర్ చేయమని కోరారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉండాల్సిన బ్యాలెన్స్‌కు, బ్యాంకు సిస్టమ్‌లో కనిపిస్తున్న బ్యాలెన్స్‌కు మధ్య భారీ తేడా కనిపించింది. కోట్లాది రూపాయలు ఉండాల్సిన చోట నిల్ బ్యాలెన్స్ చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై బ్యాంకుపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ రూ.590 కోట్ల బాగోతం బయటపడింది.
ఈ కుంభకోణం బయటపడటంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ యాజమాన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న నలుగురు కీలక అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన సమాచారం ప్రకారం.. ఈ దోపిడీలో ప్రమేయం ఉన్న వారు ఎవరైనా సరే, వారు బ్యాంకు ఉద్యోగులైనా లేక బయటి వ్యక్తులైనా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, సివిల్ చర్యలకు కూడా ఉపక్రమించింది.
ఈ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకునేందుకు బ్యాంకు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తోంది. అంటే ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ప్రతి పైసా లెక్కను బయటకు తీయించనున్నారు. అదే సమయంలో ఈ మాయమైన నిధులు వేరే ఏ ఏ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో గుర్తించి, ఆయా బ్యాంకుల అధికారులను ఐడీఎఫ్‌సీ అలర్ట్ చేసింది. ఆ అనుమానాస్పద ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని కోరింది. తద్వారా నిధులు మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. హర్యానా సర్కార్ నిధులు ఇలా మాయమవ్వడం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.