New Labour Code : కొత్త లేబర్ కోడ్ సంచలనం..భారీగా పెరగనున్న ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ..తగ్గనున్న నెట్ శాలరీ.
New Labour Code : కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21, 2025 న కొత్త లేబర్ కోడ్‌ను నోటిఫై చేసింది. ఇది ఉద్యోగుల జీతం నిర్మాణాన్ని భారీగా మార్చబోతోంది. ముఖ్యంగా రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల CTC మధ్య ఉన్న ఉద్యోగులపై ఈ మార్పు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత (గ్రాట్యుటీ,పెన్షన్) బలోపేతం అవుతుంది. అయితే దీనివల్ల ప్రతి నెలా మన చేతికి వచ్చే ఇన్-హ్యాండ్ శాలరీ (నెట్ టేక్-హోమ్ శాలరీ) మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. మీ మొత్తం జీతం మారకపోయినా, అది మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చే విధానం మాత్రం పూర్తిగా మారిపోతుంది.
కొత్త నిబంధనల వెనుక ఉన్న ప్రధాన కారణం వేతనం నిర్వచనం. బేసిక్ పే , కరువు భత్యం (DA), రిటైనింగ్ అలవెన్స్ కలిపి ఉండే వేతనం అనేది, మీ మొత్తం CTCలో కనీసం 50% ఉండాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత విధానంలో కంపెనీలు పీఎఫ్, గ్రాట్యుటీపై భారం తగ్గించుకోవడానికి బేసిక్ పేను 50% కంటే తక్కువగా ఉంచి, అలవెన్సుల (HRA, స్పెషల్ అలవెన్స్ వంటివి) భాగాన్ని ఎక్కువగా ఉంచేవి. ఇప్పుడు ఆ అలవెన్సులు 50% దాటితే, ఆ అదనపు మొత్తాన్ని వేతనంలో చేర్చడం తప్పనిసరి. ఈ వేతనం పెరగడం వల్ల, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా పథకాలకు మీ తరపున కట్టే మొత్తం పెరుగుతుంది. ఈ మొత్తం మీ CTC నుంచే కట్ అవుతుంది కాబట్టి, మీ నెట్ టేక్-హోమ్ శాలరీ తగ్గుతుంది. ఉదాహరణకు రూ.7 లక్షల CTC ఉన్న ఉద్యోగికి ఏటా సుమారు రూ.11,767 వరకు టేక్-హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది.
ప్రతి నెలా జీతం కొద్దిగా తగ్గినా, ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గ్రాట్యుటీ, పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ లెక్కించే వేతనం ఆధారం పెరుగుతుంది. డెలాయిట్ నివేదిక ప్రకారం.. రూ.10 లక్షల CTC ఉన్న ఉద్యోగికి 7 ఏళ్ల సర్వీస్ తర్వాత వచ్చే గ్రాట్యుటీ మొత్తం 80% వరకు పెరిగి, రూ.1,34,610 నుంచి రూ.2,41,460 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే పీఎఫ్‌కు ఎక్కువ మొత్తం జమ కావడం వల్ల మీ రిటైర్‌మెంట్ నిధి కూడా పెరుగుతుంది. కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలు మొత్తం CTCని పెంచాల్సిన అవసరం లేదు. కానీ అలవెన్సులు 50%కు మించకుండా చూసుకోవాలి. లేదంటే ఆ అదనపు మొత్తాన్ని వేతనంగా పరిగణించి పీఎఫ్, గ్రాట్యుటీలను లెక్కించాలి. ఈ మార్పులను అమలు చేయడానికి కంపెనీలు త్వరలోనే తమ జీతం నిర్మాణంలో పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది.