New Rules from January 1 : న్యూ ఇయర్ న్యూ రూల్స్..నేటి నుంచే మారిన నిబంధనలు ఇవే.
New Rules from January 1 : కొత్త ఏడాది 2026 గ్రాండ్‌గా మొదలైంది. అయితే ఈ కొత్త సంవత్సరంతో పాటు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టేలా, అలాగే మరికొన్ని ఊరటనిచ్చేలా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ నిబంధనల నుంచి ఆదాయపు పన్ను రిటర్న్‌ల వరకు, గ్యాస్ సిలిండర్ ధరల నుంచి 8వ వేతన సంఘం అమలు వరకు.. నేటి నుంచి (జనవరి 1, 2026) మారిన ఆ ముఖ్యమైన అంశాలేంటో వివరంగా చూద్దాం.
ఆదాయపు పన్ను రిటర్న్‌ల గడువు ముగిసింది
పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. నేటి నుంచి (జనవరి 1, 2026) మీరు 2025-26కి సంబంధించి రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయలేరు. గతంలో చేసిన రిటర్న్‌లలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో, ఇకపై మీరు అప్‌డేటెడ్ రిటర్న్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలాగే, గడువు ముగిసిన తర్వాత వేసే బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం కూడా నిన్నటితో ముగిసింది.
పాన్-ఆధార్ లింకింగ్ ఇక తప్పనిసరి
మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ఇచ్చిన ఆఖరి గడువు డిసెంబర్ 31తో ముగిసింది. జనవరి 1 నుంచి లింక్ చేయని పాన్ కార్డులన్నీ ఇన్-యాక్టివ్ అయిపోతాయి. దీనివల్ల బ్యాంక్ అకౌంట్ తెరవడం, లోన్ తీసుకోవడం లేదా ట్యాక్స్ ఫైల్ చేయడం వంటి పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి, మీ పాన్ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ఆధార్ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేయాల్సిందే.
8వ వేతన సంఘం అమలులోకి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. అనుకున్నట్లుగానే జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. అయితే, దీనివల్ల పెరిగే జీతాల పెంపు నిర్ణయాలు, బకాయిల చెల్లింపులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, అధికారికంగా ఈ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది.
గ్యాస్ ధరల వాత.. విమాన ప్రయాణం చౌక
కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 111 రూపాయలు పెరిగింది. 2023 తర్వాత ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే మొదటిసారి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు, జెట్ ఫ్యూయల్ ధరలు 7 నుంచి 8 శాతం తగ్గడం వల్ల విమాన టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోర్: ఇకపై మీ క్రెడిట్ స్కోర్ ప్రతి 15 రోజులకు ఒకసారి కాకుండా, ప్రతి వారం అప్‌డేట్ అవుతుంది. దీనివల్ల మీరు కట్టే ఈఎంఐల ప్రభావం వెంటనే స్కోర్ మీద కనిపిస్తుంది.
ఐఆర్సీటీసీ : జనవరి 5 నుంచి ఆధార్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 12 నుంచి ఈ సమయం అర్ధరాత్రి వరకు పెరుగుతుంది.
ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ: క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లభించే ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు, రివార్డ్ పాయింట్ల రూల్స్ జనవరి 10 నుంచి ఫిబ్రవరి మధ్యలో మారుతున్నాయి.