Petrol And Diesel Price: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..! వచ్చే వారం నుండే..
Petrol And Diesel Price: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 110 డాలర్లకు చేరుకుంది.;
Petrol And Diesel Price: ఉక్రెయిన్, రష్యా మధ్య గొడవ ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ప్రభావం చూపనుంది. ఆ దేశాలలో ఉన్న ప్రజలు ఇప్పటికే ఆహారం దొరకక, ఉండడానికి సురక్షితమైన చోటు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇతర దేశంలో ప్రజలు దీని వల్ల జరిగే పరిణామాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రానున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురును, బంగారం లాంటివి ఎక్కువగా సప్లై చేస్తున్నవాటిలో ఉక్రెయిన్ కూడా ఒకటి. ఇప్పుడు ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బను ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు అన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే చమురు, బంగారం ధర ఆకాశాన్నంటనుందని ఇప్పటికే ప్రజలు అంచనాకు వచ్చారు. అయితే దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయని సమాచారం.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 110 డాలర్లకు చేరుకుంది. 2014లో చమురు ధర ఇంత ఉండేది.. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇంత గరిష్టాన్ని తాకడం ఇదే మొదటిసారి. మార్చి 1 నుండే ఇండియా కొనుగోలు చేస్తున్న చమురు ధర 102 డాలర్లు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు వీటిలో చాలావరకు నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మార్చి 10లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పూర్తవుతుంది. దాని తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటే ప్రభుత్వానికి ఎక్కువగా నష్టం కలగకుండా ఉంటుందో ప్రభుత్వం నిర్ణయించనుంది. గత 118 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే త్వరలోనే ఈ ధరలు భగ్గుమననున్నాయని అంచనాకు వచ్చేశారు ప్రజలు.