Renault : డిస్కవరీ డేస్ తీసుకొచ్చిన రెనాల్ట్.. జీరో వడ్డీతో ఫైనాన్స్, రూ.35 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్.
Renault : రెనాల్ట్ ఇండియా దేశవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం ఒక పెద్ద ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. కంపెనీ డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 22, 2025 వరకు మొత్తం 13 రోజుల పాటు డిస్కవరీ డేస్ పేరుతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించనుంది. ఈ సమయంలో కస్టమర్‌లు రెనాల్ట్ కొత్త, అప్‌డేట్ అయిన కార్లను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం భారతదేశంలోని అన్ని రెనాల్ట్ డీలర్‌షిప్‌లలో జరుగుతుంది. డీలర్‌షిప్‌లను ఒక రకమైన కార్నివాల్ వాతావరణంలో ఏర్పాటు చేసి కస్టమర్లకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
కైగర్, ట్రైబర్‌లపై బెస్ట్ ఆఫర్లు
ఈ 13 రోజుల క్యాంపెయిన్‌లో కంపెనీ కొత్త కైగర్, ట్రైబర్ మోడళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కస్టమర్‌లకు అందిస్తుంది. డీలర్‌షిప్‌లలో థీమ్ ఆధారిత ఈవెంట్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌ల ద్వారా కార్ల ప్రత్యేకతలు, అప్‌డేట్ అయిన ఫీచర్లను వివరిస్తారు. వరుసగా రెండు వీకెండ్‌లను కవర్ చేసే ఈ క్యాంపెయిన్ ద్వారా ఎక్కువ మంది ప్రజలు షోరూమ్‌లను సందర్శిస్తారని, బ్రాండ్‌తో అనుసంధానం అవుతారని రెనో ఆశిస్తోంది.
కస్టమర్లను ఆకర్షించే డిస్కౌంట్ ప్రయోజనాలు
క్యాంపెయిన్‌తో పాటు, రెనాల్ట్ ఇండియా అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా ప్రకటించింది. అన్ని మోడళ్లపై జీరో శాతం వడ్డీ రేటుతో ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో పాటు లోన్ ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు కూడా లభిస్తుంది. పాత కారును మార్చుకునే కస్టమర్లకు రూ.35,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, కొత్త కారు కొనుగోలుపై రూ.25,000 వరకు క్యాష్ బెనిఫిట్ కూడా అందిస్తారు. ఈ ఆఫర్‌లు ఎక్కువ మంది కస్టమర్‌లను కొత్త మోడళ్లను కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
రెనాల్ట్ అమ్మకాల వృద్ధి
రెనో ఇండియాకు ఈ సంవత్సరం అమ్మకాల పరంగా సానుకూలంగా ఉంది. కంపెనీ అక్టోబర్ నెలలో 21% , నవంబర్ 2025లో 30% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధి ప్రధానంగా కొత్త తరం కైగర్, ట్రైబర్‌ల విడుదల ద్వారా వచ్చింది. GST తగ్గింపు తర్వాత ఈ కార్ల ధరలు మరింత మెరుగయ్యాయి. ఈ డిస్కవరీ డేస్ క్యాంపెయిన్ ద్వారా పెరుగుతున్న అమ్మకాలను మరింత బలోపేతం చేసుకోవాలని, మార్కెట్ వాటాను పెంచుకోవాలని రెనో భావిస్తోంది.