Renault India : రెనో కార్ల ధరలకి రెక్కలు.. కొత్త ఏడాదిలో కారు కొనాలంటే జేబుకి చిల్లు పడాల్సిందే!
Renault India : కొత్త ఏడాదిలో కారు కొనాలనుకునే వారికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా షాకిచ్చింది. పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఆర్థిక సవాళ్లను సాకుగా చూపుతూ 2026 జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మీరు రెనో క్విడ్, ట్రైబర్ లేదా కైగర్ కార్లను సొంతం చేసుకోవాలనుకుంటే, ఈ నెలాఖరులోపు బుక్ చేసుకోవడమే లాభదాయకం.
ధరల పెంపు ఎందుకు?
రెనాల్ట్ ఇండియా తన కార్ల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు అనేది మీరు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఆటోమొబైల్ రంగంలో ముడిపదార్థాల ధరలు పెరగడం , రవాణా ఖర్చులు భారం కావడం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. కేవలం రెనాల్ట్ మాత్రమే కాదు.. మర్సిడెస్ బెంజ్, నిస్సాన్, ఎంజీ మోటార్ వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా జనవరి నుంచి ధరల పెంపును ప్రకటించాయి.
డిసెంబర్ ఆఫర్లను వదులుకోకండి
వినియోగదారులు పాత ధరలకే కార్లను సొంతం చేసుకోవాలంటే, డిసెంబర్ 31, 2025 లోపు బుకింగ్ పూర్తి చేసుకోవాలని కంపెనీ సూచిస్తోంది. దీనివల్ల పెరగబోయే ధరల భారం నుంచి తప్పించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇయర్-ఎండ్ ఆఫర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని రెనో పేర్కొంది.
రెనాల్ట్ పాపులర్ మోడళ్ల ప్రస్తుత ధరలు
రెనాల్ట్ క్విడ్ : ఇది కంపెనీకి చెందిన బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. దీని ప్రారంభ ధర దాదాపు రూ.4.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఎస్‌యూవీ తరహా లుక్, 184 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 8 ఇంచుల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు దీని సొంతం.
రెనాల్ట్ ట్రైబర్ : తక్కువ ధరలో 7 సీటర్ కావాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.5.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2025లో దీనికి సేఫ్టీ పరంగా మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చారు.
రెనాల్ట్ కైగర్ : స్టైలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా పేరున్న కైగర్ ధర కూడా రూ.5.76 లక్షల నుంచే మొదలవుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తో వచ్చే ఈ కారు యువతను బాగా ఆకర్షిస్తోంది.
మరోవైపు, ధరల పెంపు వార్త కాస్త ఇబ్బందికరంగా ఉన్నా.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ జనవరి 26న విడుదల కాబోతుండటం ఆటోమొబైల్ ప్రియులకు ఊరటనిచ్చే విషయం.