Budget Cars : 10 లక్షల లోపు కార్లకే జై కొడుతున్న జనాలు.. పండుగ సీజన్‌లో భారీగా పెరిగిన సేల్స్.
Budget Cars : ఈసారి పండుగ సీజన్‌లో దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద మార్పు కనిపించింది. ఒకవైపు ప్రీమియం కార్ల మార్కెట్ పెరుగుతున్నప్పటికీ మరోవైపు రూ.10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు చాలా సంవత్సరాల తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల సందర్భంగా పెరిగిన కొనుగోలు సెంటిమెంట్ అని చెప్పవచ్చు. జీఎస్టీ స్లాబ్‌లో మార్పులు, ముఖ్యంగా చిన్న కార్లు, కాంపాక్ట్ ఎస్‌యూవీల ధరలు తగ్గించడంతో సామాన్య కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది.
ఎస్‌బీఐ రీసెర్చ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రజల సెలక్షన్లో బడ్జెట్ కార్లదే పైచేయి అని స్పష్టంగా తెలుస్తోంది. సెప్టెంబర్-అక్టోబర్ 2025 మధ్య అమ్ముడైన మొత్తం కార్లలో 78% కార్లు రూ.10 లక్షల కంటే తక్కువ ధర ఉన్నవే. ఈ 78% లో కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ధరల మధ్య ఉన్న కార్ల వాటా 64% గా ఉంది. రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల వాటా 14% గా నమోదైంది.
ఈ గణాంకాలు పండుగ సీజన్‌లో బడ్జెట్ కార్లే మార్కెట్‌కు వెన్నెముకగా నిలిచాయని స్పష్టంగా చూపిస్తున్నాయి. నవరాత్రి నుంచి దీపావళి వరకు, ఆటో పరిశ్రమ ప్రతి రెండు సెకన్లకు ఒక కారును విక్రయించిందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ మొత్తం లాభంలో అతిపెద్ద వాటాను దక్కించుకున్న సంస్థ మారుతి సుజుకి. ఎందుకంటే ఆ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ చిన్న, బడ్జెట్ మోడల్స్ ఉన్నాయి.
40 రోజుల పండుగ సీజన్‌లో, మారుతి సుజుకికి 5 లక్షల బుకింగ్స్ వచ్చాయి. 4.1 లక్షల రిటైల్ అమ్మకాలు జరిగాయి. ఇది గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. ఈ అమ్మకాల్లో దాదాపు 2.5 లక్షల కార్లు చిన్న కార్లే కావడం విశేషం. జీఎస్టీ తగ్గింపు తర్వాత చిన్న మోడళ్ల మార్కెట్ వాటా 16.7% నుంచి 20.5% కి పెరిగింది. చిన్న కార్ల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 35% కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన ఖరీదైన కార్లను కూడా ఇప్పుడు గ్రామీణ మార్కెట్ ఆహ్వానిస్తోంది. మొత్తానికి ధరలు తగ్గడం, పండుగ సెంటిమెంట్ కలగలిసి ఆటోమొబైల్ రంగానికి ఈ సీజన్‌లో భారీ విజయాన్ని అందించాయి.