Skoda Kylaq : లక్ష రూపాయలు జేబులో మిగిలినట్టే.. ఆర్మీ వాళ్లకి స్కోడా ఇచ్చిన అదిరిపోయే గిఫ్ట్.
Skoda Kylaq : ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా తన సరికొత్త ఎస్‌యూవీ కైలాక్‌తో భారత మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2025లో లాంచ్ అయిన ఈ కారు, అతి తక్కువ కాలంలోనే స్కోడా సేల్స్‌లో 60 శాతం వాటాను ఆక్రమించి నంబర్-1 స్థానానికి చేరుకుంది. తాజాగా కొత్త జీఎస్టీ నిబంధనల వల్ల దీని ధర మరింత తగ్గడమే కాకుండా, ఆర్మీ వారికి అందించే సీఎస్‌డీ క్యాంటీన్లలో ఇది దాదాపు లక్ష రూపాయల వరకు తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో కైలాక్ ఇప్పుడు సామాన్యుల నుంచి సైనికుల వరకు అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది.
అదరగొట్టే ఫీచర్లు.. అదిరిపోయే సేఫ్టీ
స్కోడా కైలాక్ కేవలం ధరలో మాత్రమే కాదు, ఫీచర్ల విషయంలోనూ దుమ్మురేపుతోంది. ఇందులో బేసిక్ మోడల్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇక టాప్ ఎండ్ ప్రెస్టీజ్ మోడల్‌కు వెళ్తే.. సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ముఖ్యంగా భారత్ NCAP క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం విశేషం. అంటే మీ ప్రయాణం అత్యంత సురక్షితమని స్కోడా హామీ ఇస్తోంది.
సీఎస్‌డీలో సరికొత్త ధరలు
సాధారణ షోరూమ్ ధరతో పోలిస్తే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) లో ఈ కారు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్మీ సిబ్బందికి ఈ ఎస్‌యూవీ దాదాపు రూ. 1 లక్ష వరకు తక్కువకే లభిస్తోంది. కైలాక్ సిగ్నేచర్ 1.0 TSI MT మోడల్ ధర రూ.8.09 లక్షలు, కైలాక్ సిగ్నేచర్ 1.0 TSI AT మోడల్ ధర రూ.9.00 లక్షలు, కైలాక్ ప్రెస్టీజ్ 1.0 TSI MT వేరియంట్ ధర రూ.10.76 లక్షలు, కైలాక్ ప్రెస్టీజ్ 1.0 TSI AT వేరియంట్ ధర రూ.11.63 లక్షలు అయింది.
పవర్‌ఫుల్ ఇంజిన్.. టాప్ పెర్ఫార్మెన్స్
ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ TSI ఇంజిన్‌ను వాడారు. ఇది 115 పీఎస్ పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్‌లో దీనికి పోటీగా మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ.. స్కోడా తన డిజైన్, ధరతో అందరినీ వెనక్కి నెట్టేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ, సేఫ్టీ కోరుకునే వారికి కైలాక్ ఇప్పుడు బెస్ట్ ఛాయిస్.