Tata Curvv : టాటా కర్వ్ స్పీడ్ మామూలుగా లేదుగా..50 వేల మార్కును దాటేసిన కూపే ఎస్‌యూవీ.

Update: 2026-01-02 06:00 GMT

Tata Curvv : టాటా మోటార్స్ తన అమ్ముల పొదిలో నుంచి మార్కెట్లోకి వదిలిన టాటా కర్వ్ ఎస్‌యూవీ-కూపే ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే 50,000 యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటి, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రియల్ గేమ్ ఛేంజర్ అని నిరూపించుకుంది. స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు, టాటా మోటార్స్ ఎస్‌యూవీ విభాగంలో తనదైన ముద్ర వేస్తోంది.

రికార్డు స్థాయి అమ్మకాలు

టాటా కర్వ్ తన ప్రస్థానాన్ని 2024 ఆగస్టులో ఎలక్ట్రిక్ మోడల్‌తో ప్రారంభించి, సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను పరిచయం చేసింది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం.. ఈ కారు మొత్తం 50,091 యూనిట్ల టోకు విక్రయాలను పూర్తి చేసుకుంది. ఇది టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా పండుగ సీజన్ అయిన అక్టోబర్ 2024లో అత్యధికంగా 5,351 యూనిట్లు అమ్ముడై తన సత్తా చాటింది.

50 వేరియంట్లలో లభ్యం

కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా టాటా కర్వ్‌ను దాదాపు 50 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 20 పెట్రోల్, 14 డీజిల్, 7 ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉన్నాయి. సాధారణ ఇంధన వెర్షన్ల ధర రూ.9.66 లక్షల నుంచి ప్రారంభమై రూ.18.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు - 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ విభాగంలో గర్జన

టాటా కర్వ్ ఈవీ రూ. 17.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఇది 45kWh, 55kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 502 కి.మీల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 11.15 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగల సామర్థ్యం దీని సొంతం. సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడకుండా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది.

పోటీ ఎవరితో అంటే?

మారుతి సుజుకి విక్టోరిస్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజ కార్లతో పాటు నేరుగా సిట్రోయెన్ బెసాల్ట్కు గట్టి పోటీనిస్తోంది. బెసాల్ట్ గత 16 నెలల్లో కేవలం 2,591 యూనిట్లు మాత్రమే అమ్ముడైతే, కర్వ్ అతి తక్కువ సమయంలోనే 50 వేల మైలురాయిని దాటేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్టైలిష్ కూపే డిజైన్, అడ్వాన్స్‌డ్ ఏడీఏఎస్ ఫీచర్లు ఈ కారును రేసులో ముందు ఉంచుతున్నాయి.

Tags:    

Similar News