Automatic Cars : బడ్జెట్ లో ఆటోమేటిక్ కారు కావాలా? రూ.5 లక్షల లోపే టాప్ 3 కార్లు ఇవే.

Update: 2026-03-12 08:45 GMT

Automatic Cars : సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చడం, క్లచ్ నొక్కడం అంటే ఎవరికైనా చిరాకే. అందుకే ఇప్పుడు చాలా మంది ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకు మాత్రమే, వాటి ధరలు కూడా చుక్కల్లో ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మధ్యతరగతి జేబుకు చిల్లు పడకుండా, బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఆటోమేటిక్ కార్లు మార్కెట్లోకి వచ్చేశాయి. రూ.5 లక్షల లోపు బడ్జెట్ లోనే దొరికే మూడు అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్ల వివరాలు మీకోసం..

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

అతి తక్కువ ధరలో ఆటోమేటిక్ కారు కావాలనుకునే వారికి మొదటి ఛాయిస్ ఎస్-ప్రెస్సో. దీని AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్ ధర కేవలం రూ.4,74,900 (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇందులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది, ఇది 65bhp పవర్‌ని ఇస్తుంది. మైలేజీ విషయంలో కూడా దీనికి తిరుగులేదు. లీటరు పెట్రోల్‌కు ఏకంగా 25.3 కి.మీ మైలేజీ ఇస్తుందని కార్ దేఖో రిపోర్ట్స్ చెబుతున్నాయి. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

రెనాల్ట్ క్విడ్

లుక్ పరంగా స్టైలిష్‌గా ఉంటూ, బడ్జెట్ లో దొరికే మరో అద్భుతమైన కారు రెనాల్ట్ క్విడ్. దీని ఎవల్యూషన్ AMT వేరియంట్ ధర రూ.4,99,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 999 సీసీ ఇంజిన్ ఉంటుంది, ఇది ఎస్-ప్రెస్సో కంటే కొంచెం ఎక్కువ అంటే 69bhp పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇది లీటరుకు 22.3 కి.మీ మైలేజీని అందిస్తుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మోడ్రన్ ఫీచర్లు ఉండటం వల్ల చిన్న కుటుంబాలకు ఇది చాలా బాగుంటుంది.

టాటా టియాగో

సేఫ్టీకు ప్రాధాన్యత ఇచ్చే వారికి టాటా టియాగో ఒక వరప్రసాదం. దీని XTA AMT వేరియంట్ ధర రూ.6,31,290 (ఎక్స్-షోరూమ్). పైన చెప్పిన రెండు కార్ల కంటే ధర కొంచెం ఎక్కువైనా, ఇందులో ఉండే 1.2 లీటర్ ఇంజిన్ ఏకంగా 86bhp పవర్‌ని ఇస్తుంది. అంటే పవర్ పరంగా ఇది చాలా స్ట్రాంగ్. మైలేజీ సుమారు 19 కి.మీ వరకు ఉంటుంది. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం వల్ల హైవే ప్రయాణాలకు కూడా ఇది చాలా సురక్షితమైనది.

పైన పేర్కొన్న ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. అంటే మీరు కారు కొనేటప్పుడు వీటికి ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్-రోడ్ ధర మీ రాష్ట్రం, నగరాన్ని బట్టి మారుతుంటుంది.

Tags:    

Similar News