Electric Cars : రూ. 10 లక్షల లోపే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 365 కి.మీ ప్రయాణం.
Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, తక్కువ రన్నింగ్ కాస్ట్ కారణంగా చాలామంది సామాన్యులు కూడా ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. మీ బడ్జెట్ 10 లక్షల రూపాయల లోపు ఉంటే, ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న మూడు ప్రధాన కార్ల గురించి తెలుసుకుందాం.
1. టాటా పంచ్ ఈవీ : ఈ జాబితాలో అత్యధిక రేంజ్ ఇచ్చే కారు ఏదైనా ఉందంటే అది టాటా పంచ్ ఈవీ. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్‌లో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 365 కిలోమీటర్ల నుండి 421 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సిటీలో తిరిగేవారికి అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్స్ వేసే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
2. టాటా టియాగో ఈవీ : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఏదంటే టాటా టియాగో ఈవీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కూడా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది (19.2 kWh, 24 kWh). ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ కారులో రీజనరేటివ్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కారు.
3. ఎంజీ కామెట్ ఈవీ : నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చిన్న కారులో తిరగాలనుకునే వారికి ఎంజీ కామెట్ ఈవీ సరైన ఛాయిస్. దీని ధర ఆశ్చర్యకరంగా రూ. 4.99 లక్షల (BaaS ప్రోగ్రామ్ కింద) నుంచి ప్రారంభమవుతుంది. అంటే మీరు బ్యాటరీని అద్దెకు తీసుకుని, కిలోమీటరుకు రూ.3.1 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీతో కలిపి కొనాలనుకుంటే దీని ధర సుమారు రూ.7.50 లక్షల నుంచి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పార్కింగ్ సమస్యలు ఉండకూడదు అనుకునేవారికి ఈ చిన్నారి కారు చాలా స్మార్ట్ ఆప్షన్.