TRADE WAR: పాక్‌తో వాణిజ్య యుద్ధం.. వీటి ధరలు పెరుగుతాయ్
పాక్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్న భారత్... కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం;
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారీ ఉగ్ర దాడి తర్వాత ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. కీలకమైన అట్టారి-వాఘా సరిహద్దును కూడా మూసేసింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తానీ పౌరులకు సార్క్ వీసాలను కూడా రద్దు చేసింది. భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాల తర్వాత, దాని ప్రభావం భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాణిజ్యంపై కనిపిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున వాణిజ్యం ఉంది. అటువంటి సమయంలో, పాకిస్తాన్‌తో సంబంధాలు క్షీణించినప్పుడు, భారతదేశంలోను అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్ భారత్ కు దిగుమతి అవుతాయి. భారతీయ మార్కెట్లలో డ్రై ఫ్రూట్స్ బాగా డిమాండ్ ఉంది. పాకిస్తాన్‌తో వాణిజ్యం మూసివేయడంతో, భారతదేశంలో ఎండిన పండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి సింధు ఉప్పుకు కూడా భారత్ లో భారీ డిమాండ్ ఉంది.
సింధు ఉప్పుు కూడా..
ప్రపంచంలో సింధు ఉప్పు అత్యధిక పరిమాణంలో లభించే దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అందుకే సింధు ఉప్పు ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో కళ్ళద్దాలలో ఉపయోగించే ఆప్టికల్ లెన్స్‌లను కూడా పాకిస్తాన్.. భారత్ కు దిగుమతి చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఆప్టికల్స్ కు భారతీయ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారతదేశంలో ఆప్టికల్ లెన్స్‌లు కూడా ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే పండ్లు, సిమెంట్, ముల్తానీ మట్టి, పత్తి, ఉక్కు, తోలు వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటుంది. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు భారత్ తో వాణిజ్యం రద్దుతో పాకిస్థాన్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ లో చాలా వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాక్ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది.