TVS iQube : టీవీఎస్ ఐక్యూబ్ జోరు..6 ఏళ్లలో 8 లక్షల స్కూటర్ల అమ్మకంతో నయా రికార్డ్.
TVS iQube : టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2020లో విడుదలైన ఈ స్కూటర్, కేవలం 6 ఏళ్ల కాలంలోనే ఏకంగా 8 లక్షల మంది కస్టమర్ల మనసు గెలుచుకుంది. మొదట్లో నెమ్మదిగా సాగిన దీని ప్రయాణం, గత రెండు ఏళ్లుగా అనూహ్య వేగాన్ని పుంజుకుంది. ముఖ్యంగా అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికంలోనే ఒక లక్షకు పైగా యూనిట్లు అమ్ముడవ్వడం దీని క్రేజ్‌కు నిదర్శనం.
జనవరి 2020లో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఈ స్కూటర్ మొదటి 3 లక్షల మైలురాయిని చేరుకోవడానికి 52 నెలల సమయం పట్టగా, తర్వాతి 5 లక్షల యూనిట్లు కేవలం 20 నెలల్లోనే అమ్ముడయ్యాయి. అంటే, గడిచిన రెండు ఏళ్లలో కస్టమర్లు ఈ స్కూటర్ వైపు భారీగా మొగ్గు చూపారు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలోనే దాదాపు 1,05,357 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వేగాన్ని చూస్తుంటే ఆర్థిక సంవత్సరం 2026 నాటికి ఏడాదికి 3 లక్షల హోల్-సేల్ అమ్మకాలను ఈ స్కూటర్ సునాయాసంగా దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ మొత్తం 6 వేరియంట్లు, 12 రంగుల్లో లభిస్తోంది. ఇందులో 2.2 kWh నుంచి 5.3 kWh వరకు వివిధ రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ధర విషయానికొస్తే.. ఢిల్లీలో ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.15 లక్షల నుంచి రూ.1.72 లక్షల వరకు ఉంది. దీనిలోని 4.4kW BLDC మోటార్ 33Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల స్కూటర్ వేగంగా దూసుకెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 75 నుంచి 82 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ముఖ్యంగా రేంజ్ విషయానికి వస్తే.. 5.1kWh బ్యాటరీ కలిగిన ST వేరియంట్ నిజమైన వినియోగంలో దాదాపు 150 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనిని 950W ఆఫ్-బోర్డ్ చార్జర్‌తో కేవలం 4 గంటల 18 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. తక్కువ సమయంలో చార్జింగ్, ఎక్కువ రేంజ్, నమ్మకమైన బ్రాండ్ కావడంతో టీవీఎస్ ఐక్యూబ్ ఈ స్థాయి రికార్డును నెలకొల్పగలిగింది. కేవలం భారత్‌లోనే కాకుండా, ఇతర దేశాలకు కూడా టీవీఎస్ ఈ స్కూటర్లను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయంగానూ తన ముద్ర వేస్తోంది.