Two Wheeler Sales : ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్ హవా..ఓలా జోరుకు బ్రేకులు వేసిన ఐక్యూబ్.
Two Wheeler Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో రారాజుగా వెలుగొందిన ఓలా ఎలక్ట్రిక్కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన 2025 తాజా గణాంకాల ప్రకారం.. దేశీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ఓలాను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. వినియోగదారులు ఇప్పుడు కేవలం ఫీచర్లనే కాకుండా, బ్రాండ్ నమ్మకాన్ని, సర్వీస్‌ను కూడా ప్రధానంగా చూస్తున్నట్లు ఈ అమ్మకాలు స్పష్టం చేస్తున్నాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025లో ఏకంగా 2,98,881 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడదితో పోలిస్తే ఇది 35.35% వృద్ధి. ముఖ్యంగా TVS iQube స్కూటర్ కు వస్తున్న ఆదరణతో పాటు, కొత్తగా లాంచ్ చేసిన ఆర్బిటర్ మోడల్ కూడా కంపెనీకి పెద్ద ప్లస్ అయ్యింది. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ తెచ్చిన మోడల్స్ సక్సెస్ అయ్యాయి.
రెండవ స్థానంలో నిలిచిన బజాజ్ ఆటో, తన చేతక్ స్కూటర్ల ద్వారా 2,69,847 యూనిట్లను విక్రయించింది. ఇక మూడవ స్థానంలో ఏథర్ ఎనర్జీ నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏథర్ తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్తాను లాంచ్ చేయడంతో అమ్మకాలు 58.91% పెరిగి 2,00,797 యూనిట్లకు చేరాయి. ఏథర్ ఇప్పుడు ఓలాను దాటేసి మూడో స్థానానికి చేరడం గమనార్హం.
ఒకప్పుడు మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కు 2025 ఒక పీడకలగా మారింది. గతేడాది 4 లక్షలకు పైగా యూనిట్లు విక్రయించిన ఓలా, ఈ ఏడాది కేవలం 1,99,318 యూనిట్లకే పరిమితమైంది. అంటే అమ్మకాలు ఏకంగా 51.11% పడిపోయాయి. సర్వీస్ సెంటర్లలో సమస్యలు, నాణ్యత పరమైన ఫిర్యాదులే ఓలా పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓలా నాలుగవ స్థానానికి పడిపోయింది.
హీరో మోటోకార్ప్ కు చెందిన Vida బ్రాండ్ అనూహ్య వృద్ధిని కనబరిచింది. ఏకంగా 149.74% వృద్ధిరేటుతో 1,09,168 యూనిట్లను విక్రయించి ఐదో స్థానంలో నిలిచింది. తక్కువ ధరలో లభిస్తున్న Vida VX2 మోడల్, బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ సదుపాయం హీరోకు బాగా కలిసొచ్చింది. దీనివల్ల బైక్ కొనేటప్పుడు బ్యాటరీ ఖర్చును తగ్గించుకునే అవకాశం కస్టమర్లకు లభించింది.