Upcoming Cars : కొత్త కార్ల జాతర..జనవరిలో మార్కెట్లోకి టాటా, మహీంద్రా నుంచి అదిరిపోయే మోడళ్లు.
Upcoming Cars : కొత్త ఏడాది 2026 ఆరంభం అదిరిపోబోతోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్ జనవరి నెలలో కొత్త కార్ల లాంచ్‌లతో కళకళలాడనుంది. ఎస్‌యూవీ లవర్స్ కోసం మహీంద్రా, టాటా, కియా, రెనాల్ట్, మారుతి సుజుకి వంటి దిగ్గజ సంస్థలు తమ బెస్ట్ మోడళ్లను రోడ్ల మీదకు తెస్తున్నాయి. కొత్త డిజైన్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లు, అత్యాధునిక ఫీచర్లతో జనవరిలో విడుదల కానున్న ఆ టాప్ కార్ల వివరాలు చూద్దాం.
కియా సెల్టోస్ - జనవరి 2: కొత్త ఏడాదిలో మొదటి బోణీ కియాదే. సెకండ్ జనరేషన్ సెల్టోస్ ధరలను జనవరి 2న కంపెనీ వెల్లడించనుంది. సరికొత్త బాక్సీ డిజైన్, ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే (రెండు 12.3 ఇంచుల స్క్రీన్లు), 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, లెవల్-2 ADAS వంటి ఫీచర్లతో ఇది మరింత స్టైలిష్‌గా వస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ దీని సొంతం.
మహీంద్రా XUV 7XO - జనవరి 5: మహీంద్రా నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న XUV 7XO (XUV700 ఫేస్‌లిఫ్ట్) జనవరి 5న మార్కెట్లోకి రానుంది. ఇందులో లోపల ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 540-డిగ్రీల కెమెరా, ప్రీమియం అడ్రినాక్స్+ సాఫ్ట్‌వేర్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల లాగే ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
మారుతి సుజుకి ఈ-విటారా - జనవరి 15: మారుతి సుజుకి నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే. హార్టెక్-ఈ ప్లాట్‌ఫారమ్ మీద తయారైన ఈ కారు జనవరి 15న విడుదల కానుంది. ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల (ARAI) వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్ కూడా ఉండటం విశేషం.
టాటా హారియర్ & సఫారీ పెట్రోల్ : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలను ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లలో కూడా లాంచ్ చేస్తోంది. కొత్త 1.5 లీటర్ హైపెరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కార్లు వస్తున్నాయి. ఇవి 170PS పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. డీజిల్ కార్లంటే భయపడే వారికి, తక్కువ ధరలో పెద్ద ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. జనవరి మొదటి వారంలోనే వీటి ధరలు వెల్లడి కానున్నాయి.
రెనాల్ట్ డస్టర్ (New Renault Duster) - జనవరి 26: చాలా కాలం తర్వాత ఐకానిక్ 'డస్టర్' బ్రాండ్ మళ్ళీ భారత్‌కు వస్తోంది. కొత్త తరం డస్టర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఆవిష్కరించనున్నారు. ఇది CMF-B ప్లాట్‌ఫారమ్ మీద రూపొందింది. ఇందులో 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్, వై-షేప్ ఎల్ఈడి లైట్లు, లెవల్-2 ADAS వంటి మోడరన్ ఫీచర్లు ఉన్నాయి. హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది మైలేజీలో కూడా దుమ్మురేపనుంది.