Maruti Suzuki : మారుతి సుజుకీ నుండి మూడు పవర్‌ఫుల్ SUVలు.. విక్టోరిస్, గ్రాండ్ విటారా, బ్రెజ్జా... ఏది బెస్ట్?
Maruti Suzuki : మారుతి సుజుకీ నుంచి వచ్చిన మూడు పాపులర్ ఎస్‌యూవీలు .. విక్టోరిస్, గ్రాండ్ విటారా, బ్రెజ్జా మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ మూడు కార్లు వాటి వాటి సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజన్లు, పర్ఫామెన్స్ కారణంగా ప్రసిద్ధి చెందాయి. విక్టోరిస్ తన లేటెస్ట్ డిజైన్, ADAS వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంటే, గ్రాండ్ విటారా ప్రీమియం లుక్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. మరోవైపు బ్రెజ్జా బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి మైలేజ్, సిటీ డ్రైవింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా ఉంది.
డైమెన్షన్స్.. ఏది పెద్దది? ఏది పొడవైంది?
సైజ్ పరంగా చూస్తే, ఈ మూడింటిలో విక్టోరిస్ అత్యంత పొడవైన ఎస్‌యూవీ. వెడల్పు, వీల్‌బేస్ విషయంలో ఇది గ్రాండ్ విటారాతో సమానంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ రెండింటికీ ఒకేలా ఉంది. అయితే బ్రెజ్జా ఈ మూడింటిలోకెల్లా ఎత్తైన కారు. బూట్ స్పేస్ విషయంలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. విక్టోరిస్ CNG వేరియంట్‌లో అండర్‌బాడీ CNG ట్యాంక్ ఇస్తున్నారు. దీనివల్ల డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి పూర్తి స్థలం లభిస్తుంది. కానీ, గ్రాండ్ విటారా, బ్రెజ్జా CNG మోడళ్లలో ట్యాంక్ బూట్ స్పేస్‌లోనే ఉంటుంది. కాబట్టి లగేజ్ పెట్టుకోవడానికి స్థలం చాలా తక్కువగా ఉంటుంది.
ఇంజన్: పవర్, మైలేజ్‌లో ఎవరు కింగ్?
ఇంజన్ విషయానికి వస్తే, మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా రెండింటిలోనూ ఒకే రకమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలు మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఆప్షన్లతో వస్తాయి. అంతేకాకుండా, ఈ రెండూ CNG ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మారుతి బ్రెజ్జా విషయానికొస్తే, ఇందులో కూడా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, కానీ ఇది కేవలం మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో మాత్రమే వస్తుంది. బ్రెజ్జాలో స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్ లేదు. అయితే, బ్రెజ్జాలో కూడా పెట్రోల్-CNG ఆప్షన్ అందుబాటులో ఉంది.
ఫీచర్లు: టెక్నాలజీలో ఎవరు టాప్?
ఫీచర్ల విషయంలో విక్టోరిస్ చాలా అడ్వాన్స్‌డ్‌గా, ఈ మూడింటిలో టాప్‌గా నిలుస్తుంది. ఇందులో లెవెల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. అంటే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి టాప్-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. దీంతో పాటు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, స్మార్ట్ పవర్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు విక్టోరిస్ సొంతం.
గ్రాండ్ విటారా కూడా ఫీచర్లలో ఏమాత్రం తక్కువ కాదు. దీని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్రాండ్ విటారాలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ.
బ్రెజ్జా తన బడ్జెట్‌కు తగినట్టుగా అవసరమైన అన్ని ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.
ధరలు: ఎవరి బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుంది?
ధరల విషయానికి వస్తే మారుతి బ్రెజ్జా ఈ మూడింటిలోనూ అత్యంత అందుబాటు ధరలో లభించే కారు. దీని ప్రారంభ ధర సుమారు రూ.8.26 లక్షల నుండి టాప్ మోడల్ ధర రూ.13.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
మారుతి విక్టోరిస్ ధర సుమారు రూ.10.50 లక్షల నుండి ప్రారంభమై రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. మారుతి గ్రాండ్ విటారా ధర సుమారు రూ.10.77 లక్షల నుండి రూ.19.72 లక్షల వరకు ఉంది. అంటే, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి విక్టోరిస్, గ్రాండ్ విటారా ధరలు దాదాపు ఒకే రేంజ్‌లో ఉన్నాయి.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రెజ్జా, విక్టోరిస్ ఎరీనా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతుండగా, గ్రాండ్ విటారా నెక్సా ప్రీమియం షోరూమ్‌ల ద్వారా అమ్ముడవుతోంది.