FD: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే
వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గింపు... ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గింపు;
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 6 శాతానికి చేరుకోవడంతో బ్యాంకులు త్వరలో ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, అధిక కాలపరిమితి కలిగిన FDలపై మరింత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5% నుంచి 7% వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 4% నుంచి 7.5% వరకు అందిస్తోంది. ప్రత్యేకంగా, SBI అమృత్ వృష్టి పథకం 444 రోజుల కాలపరిమితికి సాధారణ పెట్టుబడిదారులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85% వడ్డీని ఇస్తోంది.
ICICI, IDBI బ్యాంక్ వడ్డీ రేట్లు
ప్రముఖ బ్యాంక్ ICICI బ్యాంక్ సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 7.85% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక ఐడీబీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 3% నుంచి 7% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 7.50% వరకు వడ్డీనిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 8.25% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
ఈ రెండు బ్యాంకుల్లో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
అధిక రాబడిని కోరుకునే వారికి ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉత్తమమైనది చెప్పవచ్చు. ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంకులో సాధారణ పౌరులకు 4% నుంచి 8.50% వరకు, సీనియర్ సిటిజన్లకు 4.60% నుంచి 9.10% వరకు వడ్డీ వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఆకర్షణీయమైన స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితి వరకు 3.5% నుంచి 7.30% వరకు వడ్డీనిస్తోంది. ప్రత్యేకంగా 456 రోజుల టెన్యూర్‌పై అత్యధికంగా 7.30% వడ్డీ లభిస్తుంది.