Delivery Record : జొమాటో, బ్లింకిట్ ఊచకోత..ఒక్క రోజే 75 లక్షల ఆర్డర్లు..సమ్మె ఉన్నా ఆగని డెలివరీ సునామీ.

Update: 2026-01-02 07:45 GMT

Delivery Record : కొత్త ఏడాది వేడుకల్లో భారతీయులు ఫుడ్‌కి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 2025 డిసెంబర్ 31 రాత్రి దేశవ్యాప్తంగా ఆర్డర్ల సునామీ సృష్టించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ తమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డును నమోదు చేశాయి. ఒక్క రోజే ఏకంగా 75 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసి ఇండస్ట్రీని షేక్ చేశాయి. గిగ్ వర్కర్ల సమ్మె పిలుపులు ఉన్నప్పటికీ, జొమాటో సేవలపై అది ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం.

రికార్డులు బద్దలు - 75 లక్షల ఆర్డర్లు

జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ ఎక్స్ వేదికగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. డిసెంబర్ 31న సుమారు 4.5 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు అహోరాత్రులు శ్రమించి 63 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించారని ఆయన తెలిపారు. గతేడాది కంటే ఈసారి ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా, బ్లింకిట్ ద్వారా పార్టీ సామాగ్రి, చిప్స్, కూల్ డ్రింక్స్, ఇతర నిత్యావసరాలకు కూడా విపరీతమైన డిమాండ్ కనిపించింది.

సమ్మె ప్రభావం ఏమంత లేదు

మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, 10 నిమిషాల డెలివరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 2.10 లక్షల మంది గిగ్ వర్కర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. అయితే, పోలీసులు, స్థానిక అధికారుల సహకారంతో కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో డెలివరీ సేవలు సజావుగా సాగాయని గోయల్ పేర్కొన్నారు. సమ్మె పిలుపునిచ్చినప్పటికీ లక్షలాది మంది రైడర్లు స్వచ్ఛందంగా పనిలోకి రావడం గమనార్హం.

భారీగా పెరిగిన ఆదాయం - రైడర్లకు పండుగే

సాధారణ రోజులతో పోలిస్తే న్యూ ఇయర్ ఈవ్ నాడు డెలివరీ పార్ట్‌నర్లకు అదనపు ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. ఈసారి జొమాటో ఒక్కో ఆర్డర్‌పై సుమారు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లించినట్లు సమాచారం. దీనివల్ల చాలా మంది రైడర్లు ఒక్క రోజే వేలల్లో సంపాదించుకున్నారు. గిగ్ ఎకానమీ అనేది భారతదేశంలో ఉపాధి కల్పనకు అతిపెద్ద ఇంజిన్ అని, ఈ వ్యవస్థ అన్యాయంగా ఉంటే ఇన్ని లక్షల మంది ఇందులో పని చేయడానికి ముందుకు వచ్చేవారు కాదని దీపేందర్ గోయల్ సమర్థించుకున్నారు.

ముందస్తు ఏర్పాట్లు - వార్ రూమ్స్

ఆర్డర్ల రద్దీని తట్టుకోవడానికి జొమాటో, బ్లింకిట్ ప్రత్యేకం వార్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. యాప్ క్రాష్ అవ్వకుండా, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ లోడ్ భరించేలా సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షించాయి. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి సపోర్ట్ టీమ్‌లను కూడా రెట్టింపు చేశారు. దీని ఫలితంగానే ఎక్కడా పెద్దగా అంతరాయం కలగకుండా 75 లక్షల ఆర్డర్లను విజయవంతంగా పూర్తి చేయగలిగారు.

గిగ్ వర్కర్ల ఆందోళనలు

మరోవైపు, గిగ్ వర్కర్ల సంఘాలు మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాయి. 10 నిమిషాల డెలివరీ వల్ల రైడర్ల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయని, రోడ్లపై వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. కంపెనీలు కేవలం లాభాల కోసమే చూస్తున్నాయని, రైడర్ల క్షేమాన్ని విస్మరిస్తున్నాయని యూనియన్ నేతలు విమర్శించారు. ఏదేమైనా, 2025 ముగింపు మాత్రం జొమాటోకు కాసుల వర్షాన్ని కురిపించింది.

Tags:    

Similar News