Vijayashanthi emotional post: ఏమైపోతోంది సమాజం.. ఎటు పోతున్నాం మనం: విజయశాంతి ఆవేదన

Vijayashanthi emotional post: తండ్రి కూడా కూతురిని కామవాంఛతో చూస్తున్నాడంటే ఇంక 'ఆమె'కు రక్షణ ఎక్కడ.

Update: 2022-05-03 13:30 GMT

Vijayashanthi emotional post: కొందరు పురుషులకి స్త్రీలు ఆటబొమ్మలుగా కనిపిస్తున్నారు.. తమ కామవాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆడదానిగా పుట్టడమే నేరమా.. అమ్మగా, చెల్లిగా, భార్యగా, అత్తగా అన్నింటా మగవాడికి తోడుగా నిలబడుతున్న స్త్రీ ప్రతి దశలో వంచనకు గురవుతోంది. కొందరి కామదాహానికి బలవుతోంది. దేశం అభివృద్ధి చెందుతోందని సంబరపడాలో, ఇంకా వారి ఆలోచనలు అధ:పాతాళంలోనే ఉన్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి.

అమ్మాయిని ఆబగా చూసే రోజులు ఎప్పుడు పోతాయి. వారి ఆలోచనలు ఎప్పుడు మారతాయి.. తండ్రి కూడా కూతురిని కామవాంఛతో చూస్తున్నాడంటే ఇంక 'ఆమె'కు రక్షణ ఎక్కడ. బయటకు వెళ్లేటప్పుడు అన్నను తోడు తీసుకెళ్లు అని అమ్మ ఎలా చెబుతుంది.. అన్న నుంచి కూడా ఆపద పొంచి ఉంటుందని ఎలా ఊహించగలదు. ప్రతి రోజు పేపర్లో వస్తున్న వార్తలు, టీవీలో వస్తున్న స్క్రోల్స్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది..

పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఈ సమాజంలో ఆ బిడ్డని ఎలా పెంచాలని తల్లి తల్లడిల్లిపోతోంది.. రోజు రోజుకు పెరుగుతోన్న అత్యాచార వార్తలు.. చదువుకున్న చదువులు, నేర్చుకున్న విజ్ఞానం ఏమవుతోంది. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో ఎందుకు ఉంటున్నారు కొందరు పురుషులు.

వినడానికే జుగుప్స్ కలిగించే దారుణ సంఘటనలు ఇటీవల తెలుగురాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయంపై నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయిన పాపాత్ములకు పసి పిల్లలు అని లేదు, పండు ముదుసలి అని లేదు కామంతో రగిలిపోతున్నాడు.. ఆడది అయితే చాలనుకుంటున్నాడు.. బలవంతంగా తన కోర్కె తీర్చుకుంటున్నాడు.

ఎదుటి వారి ఇష్టా ఇష్టాలతో పనిలేదు.. లోకం ఏమనుకుంటుందో అన్న ధ్యాస లేదు.. కనీసం ఒక్క క్షణం ఆలోచన లేదు.. చేసేది తప్పా ఒప్పా అన్న విచక్షణ లేదు.. పరువు, ప్రతిష్టలను గాలికి వదిలేసి క్షణికానందం కోసం ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ అవమానాన్ని భరించలేక అత్యాచార బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో.. వార్తల్లో వచ్చేవి కొన్నే.. కానీ వెలుగు చూడని కేసులు ఎన్నో.. ఫలానా వాడి నుంచి తనకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా ఆమె వంచనకు గురైన సంఘటనలు కోకొల్లలు.

ఎక్కడ బ్రతకాలి.. ఎలా బ్రతకాలి.. ప్రతి రోజు భయం భయంగా.. ఈ సంఘటనలకు ఎవరో ఒకరు బాధ్యత వహించి చర్యలు తీసుకుంటారనుకోవడం పొరపాటు.. సమాజంలో మార్పు రావాలి.. ఆలోచనల్లో మార్పు రావాలి.. స్త్రీని గౌరవప్రదంగా చూసే రోజు ఎప్పుడు వస్తుంది. విద్యార్ధి దశలో అనేక వ్యసనాలకు బానిసలవుతోంది యువత. మానసిక దౌర్భల్యంతో వారేం చేస్తున్నారో మరిచిపోతున్నారు.

గంజాయి పార్టీలు, అర్థరాత్రి బైక్ రైడింగులు, పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టడానికి తీరిక లేని తల్లిదండ్రులు.. ఒక స్థిర సంకల్పంతో విమెన్ ఫ్రెండ్లీ సమాజం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సృష్టికి మూలంగా నిలిచిని స్త్రీ మూర్తిని గౌరవించేలా మన సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. మొదటి అడుగు మన ఇంటి నుంచే మొదలు కావాలి.

Vijayashanthi

తెలుగు రాష్ట్రాల్లో వినడానికే జుగుప్స కలిగించే దారుణ అత్యాచారాలు గత కొద్ది రోజులుగా మనల్ని కట్టి కుదిపేస్తున్నాయి. ఈ నీచ కృత్యాలకు పాల్పడినవారిలో కొందరు బయటివారు కాగా... మరికొందరు కుటుంబ సభ్యులే కావడం పరమ హేయం. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ పాపాత్ములకు పసిపిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేదు. ఈ పరిణామాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకపోవచ్చు, కానీ ఇటీవల ఈ పాపాలు జరిగింది తెలుగు నేలపై కావడంతో సోషల్ మీడియా సహా మన చానెళ్లు, పత్రికలు ఏం చూసినా ఇవే కనిపిస్తూ మనందరినీ నిలదీస్తున్నాయి. ఎవరిది ఈ తప్పు? ప్రతి దానికీ ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని మాత్రమే వేలెత్తి చూపడం వల్ల లాభం లేదు. వ్యక్తిగా మనమేం చేస్తున్నాం? ఇంట్లోని ఆడపిల్లకు అండగా నిలిచేలా అబ్బాయిలను మలుచుకుంటున్నామా? ఇటీవలి కాలంలో విద్యార్థి లోకం, యువతరం డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుని మానసిక దౌర్భల్యాలకు లోనవడం మనం కళ్లారా చూస్తున్నాం. హైస్కూలు స్థాయిలో సైతం పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం, గంజాయితో పార్టీలు చేసుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలోనే కలకలం రేపాయి. ఇవిగాక మరోవైపు బైక్ రేసింగులు, బెట్టింగులు ఉండనే ఉన్నాయి.

సిగ్గుపడేలా... తలదించుకునేలా సంచలన ఘటనలు జరిగినప్పుడల్లా కొన్ని రోజుల పాటు ర్యాలీలు, నిరసనలు చేసి ఆయాసంతో ఆగిపోవడం తప్ప... ఒక స్థిర సంకల్పంతో ఎంత మేరకు మనం విమెన్ ఫ్రెండ్లీ సమాజాన్ని నిర్మించుకున్నాం? గుండెల మీద చెయ్యేసి చెప్పండి. మన సమాజంలో ఈ తీరు మారే వరకూ స్త్రీల ఉద్ధరణ పేరిట ఎన్ని పథకాలు పెట్టినా... ఒరిగేదేమీ ఉండదు. ఇంట్లో మొదలుపెట్టి స్కూలు, కాలేజీ, ఆఫీస్... ఇలా ప్రతి దశలోనూ స్త్రీని గౌరవప్రదంగా చూసే వాతావరణాన్ని కల్పించాలి. దోషులకి ఒక పక్క శిక్షలు పడుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుందనే పరిశోధన, సంస్కరణ వెను వెంటనే జరగాలి. ఇందుకు అందరం కలసి రావాలి. ఒకనాటి నా సందేశాత్మక చిత్రం ప్రతిఘటనను పదే పదే గుర్తు చేసుకోవలసిన అవసరం నేటికీ కనిపించడం దురదృష్టకరం. దయచేసి మేలుకోండి.... సృష్టికి మూలంగా నిలిచిన స్త్రీని గౌరవించేలా మన సమాజాన్ని తీర్చిదిద్దుకుందాం కదలి రండి.

విజయశాంతి

Full View


Tags:    

Similar News