'మా' బరిలో నేను కూడా..: హేమ
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగియనుండడంతో టాలీవుడ్‌లో ఎలక్షన్ హడావిడి మొదలైంది.;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు రానే వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగియనుండడంతో టాలీవుడ్‌లో ఎలక్షన్ హడావిడి మొదలైంది. ఇప్పటికే మా అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా తాజాగా సీనియర్ నటి హేమ కూడా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వాతావరణం వేడెక్కింది.
ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా అనేక పదవులు చేపట్టాను. ఆయా పదవులకు న్యాయం చేశాను. ఈసారి ట్రెజరర్‌గా పోటీ చేయాలనుకున్నాను. కానీ నా ఆలోచన మార్చుకున్నాను.
ఎలక్షన్స్ ప్రకటించగానే ప్రకాష్ రాజ్ గారు, మంచు విష్ణు, జీవిత గారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దలు ఎన్నికల బరిలో దిగుతున్నారని తెలిసాక.. పోటీ చేయొద్దని అనుకున్నా. కానీ సినీ ప్రముఖుల నుంచి వత్తిడి వచ్చింది. ఇంతకు ముందు నేను పోటీ చేసినప్పుడు నన్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయకూడదని అన్నారు.
పరిశ్రమకు సంబంధించి ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వు బరిలో ఉండాలి అన్నారు. పోటీ చేయనని చెప్పినా వినకుండా నాపై ఒత్తిడి చేస్తున్నారు. దాంతో నాకు అండగా నిలిచిన వారందరి కోసం, నా వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను అని హేమ అన్నారు.