సరైన విజయాలు లేక టాలీవుడ్ సతమతం అవుతుంది. కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు. కలెక్షన్స్ తెచ్చుకుంటోన్న సినిమాలన్నీ హిట్స్ అని చెప్పలేని పరిస్థితి. బట్ ఎలా చూసినా ఈ 2025లో సక్సెస్ రేట్ చాలా అంటే చాలా తగ్గింది. అందుకే ఈ ఆగస్ట్ అయినా టాలీవుడ్ కు మంచి విజయాలు పడతాయా అనుకుంటున్నారు. మరి ఈ ఆగస్ట్ లో వస్తోన్న సినిమాలేంటీ అనేది చూస్తే.. ఈ ఫస్ట్ న తమిళ్ డబ్బింగ్ మూవీ సార్ మేడమ్, తెలుగు నుంచి థ్యాంక్యూ డియర్ చిత్రాలు విడుదలయ్యాయి. బట్ ఈ రెండు సినిమాలనూ జనం పెద్దగా పట్టించుకోలేదు అనే చెప్పాలి.
ఇక ఆగస్ట్ 8న బకాసుర రెస్టారెంట్ అనే సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ వేసుకుంది. కమెడియన్స్ హర్ష చెముడు, ప్రవీణ్ ప్రధానా పాత్రల్లో నటించిన సినిమా ఇది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ కు సాలిడ్ ఊపు తెచ్చే సినిమాలుగా ఆగస్ట్ 14న విడుదలవుతోన్న కూలీ, వార్ 2 చిత్రాలను చూస్తోంది టాలీవుడ్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియార అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు నుంచి కూడా భారీ వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.
ఇక రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపైనా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రజినీకాంత్ ఈ ఏజ్ లో కూడా ఇంకా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అలాంటి తను లోకేష్ డైరెక్షన్ లో చేసిన సినిమా కావడం, నాగార్జున విలన్ పాత్ర చేయడం సినిమా రేంజ్ ను పెంచుతున్నాయి. ఈ రెండు సినిమాలూ ఇండియన్ మూవీ బాక్సాఫీస్ కు కొత్త ఊపు తెస్తాయి అని నమ్ముతున్నారు.
తర్వాతి వారం అంటే ఆగస్ట్ 22న అనుపమ పరమేశ్వరన్ పరదా, నరేష్ అగస్త్యల మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో పరదా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా కనిపిస్తోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇక నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా నటించిన సినిమా మేఘాలు చెప్పిన ప్రేమకథ. ఈ మూవీ టీజర్ బావుంది. పాట ఆకట్టుకుంది. ఇంప్రెసివ్ కంటెంట్ లా కనిపిస్తోంది. విపిన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 22న విడుదలవుతోంది.
ఆగస్ట్ లాస్ట్ వీక్ లో 27న మాస్ మహరాజ్ రవితేజ నటించిన మాస్ జాతర విడుదల కాబోతోంది. భాను భోగవరపు డైరెక్ట్ చేసినఈ చిత్రం సమ్మర్లోనే విడుదల కావాల్సింది. వాయిదా పడింది. ధమాకా తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన నటించిందీ మూవీలో. క్రాక్ తర్వాత మాస్ రాజా మళ్లీ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. కొందరు ఆగస్ట్ 27 నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతుందంటున్నారు. కానీ కాకపోవచ్చు.
ఇక రీసెంట్ గానే ఇదే డేట్ కు మేమూ వస్తున్నాం అని ప్రకటించారు సుందరకాండ మేకర్స్. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేశాడు. ఇది కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫైనల్ గా ఆగస్ట్ 27న రిలీజ్ అని పోస్టర్ వేశారు.
ఫినిషింగ్ టచ్ అంటూ రెండు డబ్బింగ్ మూవీస్ ఆగస్ట్ 29న విడుదలవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, అలాగే జాన్వీ కపూర్ పరమ్ సుందరి ఆ డేట్ లో వస్తున్నాయి. సో.. ఆగస్ట్ నెల ప్రతి వారంలోనూ సందడి కనిపిస్తోంది. ఈ సందడి కమర్షియల్ గా కూడా పెరిగితే ఇండస్ట్రీ హ్యాపీస్.. లేదంటే నిర్మాతలు లాస్.