Tollywood : మళ్లీ థియేటర్లలోకి బాహుబలి.. ప్రశ్న, సమాధానం ఒకేసారి వస్తున్నాయన్న జక్కన్న
బాహుబలి...ఈ ఒక్క సినిమా తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. భారతీయ సినీ చరిత్ర లో సంచలనం సృష్టించింది. దర్శకుడు రాజమౌళి కే కాకుండా హీరో ప్రభాస్, విలన్ రానా తదితరులను పాన్ ఇండియా స్టార్ట్స్ ను చేసింది బాహుబలి. సినిమాల వసూళ్లను సైతం బాహుబలి , నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ ప్రత్యేకంగా లెక్కించే స్థాయి లో వసూళ్లను సాధించింది బాహుబలి.. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి తెలుగు సినిమా సత్తా చాటింది.
ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులను గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం..మరోసారి ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. ఐతే రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సినిమాను ఓకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రశ్న, సమాధానం ఒకేసారి వస్తున్నాయంటూ పోస్టు చేశారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.
‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ సంయుక్త భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. "పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న, సమాధానం రెండూ కలిసి ఒకే గ్రాండ్ ఎపిక్‌గా వస్తున్నాయి" అంటూ ప్రభాస్ పేర్కొన్నారు. ఎన్నో జ్ఞాపకాలు, అంతులేని స్ఫూర్తినిచ్చిన ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి తెలిపారు.
'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాలను కలిపి ఒకే సినిమాగా చూడాలన్న అభిమానుల కోరిక ఈ రీ-రిలీజ్తో నెరవేరనుంది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల తో పాటు సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత కూడా అదే ఆదరణతో 'బాహుబలి' మళ్లీ థియేటర్లలోకి రానుండటం విశేషం.