Bandla Ganesh: ఇలా చేశావేంటి బండ్ల.. ఈ సంచలన నిర్ణయం వెనుక కారణం వాళ్లిద్దరేనా?
Bandla Ganesh: బండ్ల గణేష్.. సినీ రంగంలో ఈ పేరుకు బాగానే క్రేజ్ ఉంది.;
Bandla Ganesh: బండ్ల గణేష్.. సినీ రంగంలో ఈ పేరుకు బాగానే క్రేజ్ ఉంది. ఆయన సీరియస్‌గా మాట్లాడిన విషయాలను కూడా ఫన్నీగా తీసుకుని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన మీద ఎన్నో ట్రోల్స్ కూడా వేస్తుంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా బండ్ల గణేష్ మాత్రం నా స్టైలే వేరు అన్నట్టుగా ముందుకు వెళ్తుంటారు. అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా ఎన్నికల్లో విషయంలో కూడా బండ్ల గణేష్ ప్రవర్తన ఇదే..
ముందుగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి జనరల్ సెక్రటరీగా పోటీకి నిలబడ్డాడు బండ్ల గణేష్. ఆ తర్వత అదే ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ చేరడం ఆయనకు నచ్చలేదు. అందుకే అందులో నుండి తప్పుకుని ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీచేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. అన్ని ఓట్లు మీ ఇష్టం. ఒక్క జనరల్ సెక్రటరీ ఓటు మాత్రం నాకు వేయండి అంటూ వెరైటీ ప్రచారం మొదలుపెట్టాడు. అన్ని చేసిన బండ్ల ఇప్పుడు మా ఎన్నికల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
నేడు ఉదయం బండ్ల గణేష్ ఇంటికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీకాంత్ వెళ్లారు. వారితో కొన్ని గంటలు చర్చించిన తర్వాత తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్టు బండ్ల తన ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. 'నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్, మెగా ఫ్యామిలీ నుండి తనకు ఉన్న సపోర్ట్‌ను చూస్తే బండ్ల ఖచ్చితంగా జనరల్ సెక్రటరీగా గెలిచేవాడని.. అనవసరంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.