Venkatesh : వెంకీ, అనిల్ రావిపూడి సంక్రాంతికి రావడం లేదా

Update: 2024-10-16 03:39 GMT

విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ ను విజయ్ భాస్కర్ తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి అనే చెప్పాలి. అప్పుడెప్పుడో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహా టైమింగ్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల్లో వెంకీని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు అనిల్. ఈ కాంబోలో వస్తోన్న మూడో సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ టైటిల్ ను కూడా ' సంక్రాంతికి వస్తున్నాం' అని పెట్టబోతున్నారనే టాక్ చాలాకాలంగా వినిపిస్తోంది. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పుడు ఈ టైటిల్ కూడా వృథా అవుతుందేమో. చాలాకాలం క్రితమే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ మూవీ నుంచి ఆ మధ్య విడుదల చేసిన వీడియో బాగా ఆకట్టుకుంది. మరోసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారని అర్థం అవుతోంది. ఈ మూవీ షూటింగ్ లొకేషన్ కు బాలయ్య కూడా వెళ్లి విష్ చేసిన ఫోటోస్ సైతం అభిమానులను అలరించాయి.

ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్. అలాంటి సీజన్ ను మిస్ చేసుకుని వీళ్లు తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు అనే వార్తలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. మరోవైపు ఈ మూవీ అవుట్ పుట్ అనుకున్నంత గొప్పగా రాలేదు అనే కమెంట్స్ కూడా కలవరపెడుతున్నాయి. ఈ కారణంగానే వాయిదా వేస్తున్నారు అనేవారూ ఉన్నారు. ఏదేమైనా వెంకీ, అనిల్ రావిపూడి కాంబోకు ఉన్న క్రేజ్ కు సంక్రాంతి లాంటి సీజన్ తోడైతే కంటెంట్ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. కమర్షియల్ గా వర్కవుట్ అయిపోతుంది. అలాంటిది పండగను కాదనుకుంటున్నారంటే నమ్మడానికి లేదు. మరి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News