TFDA : టీఎఫ్‌డీఏ నూతన అధ్యక్షుడిగా దర్శకుడు వీరశంకర్‌

Update: 2024-02-12 05:01 GMT

తెలుగు సినీ దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్‌ (వీరశంకర్‌) గెలుపొందారు. 2024 ఫిబ్రవరి 11వ తేదీన 2024–2026 సంవత్సరాలకు గాను హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. ఇందులో 2000 మంది సభ్యలుండగా.. 1113 ఓట్లు పోలయ్యాయి. పోటీలో అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి, పానుగంటి రాజారెడ్డి ఉన్నారు. వీరశంకర్ కు అత్యధికంగా 536 ఓట్లు వచ్చాయి.

ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్‌వీఎన్‌ రెడ్డి (వశిష్ఠ), జనరల్‌ సెక్రటరీగా సీహెచ్‌ సుబ్బారెడ్డి, జాయింట్‌ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా పీఎస్‌ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్‌ కొలను, శ్రీరామ్‌ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ .. తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్‌ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తామని తెలిపారు. కాగా వీరశంకర్ 2004 లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో గుడుంబా శంకర్ (Goodumbha Shankar) సినిమా తీసాడు. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మణిశర్మ (Mani Sharma) మ్యూజిక్ అందించాడు.

Tags:    

Similar News