Comedy Kings Malli Karjuna Rao: బట్టల సత్యం అలియాస్ మల్లిఖార్జున రావు.. కామెడీ స్టార్ పుట్టిన రోజు స్పెషల్

Comedy Kings Malli Karjuna Rao: ఎనభయవ దశకం నుంచి తొంభైల చివరి వరకూ తెలుగు సినిమా హాస్యం కొత్త పుంతలు తొక్కింది.

Update: 2022-12-17 07:43 GMT

Comedy Kings Malli Karjuna Rao: ఎనభయవ దశకం నుంచి తొంభైల చివరి వరకూ తెలుగు సినిమా హాస్యం కొత్త పుంతలు తొక్కింది. ఆ పుంతల్లో నుంచే ఎంతో మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. వచ్చిన వారంతా తమదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో నవ్వులు పంచిన వారే. అలా వచ్చిన వాడే బట్టల సత్యం అలియాస్ మల్లిఖార్జున రావు. వైవిధ్యమైన స్లాంగ్ తో డిఫరెంట్ టోన్ తో అలరించిన మల్లిఖార్జునరావు కామెడీని ఓసారి తలచుకుందాం..

మల్లిఖార్జునరావు పూర్తి పేరు పీలా కాశీ మల్లిఖార్జున రావు. పుట్టింది విశాఖ జిల్లా అనకాపల్లిలో.. స్కూల్ డేస్ నుంచే నాటకాలు వేయడం అలవాటు చేసుకున్నారు. వాటి ద్వారానే నటుడిగా నిరూపించుకున్నారు. తర్వాత అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు.. నటుడిగా వేదికలపై ప్రూవ్ చేసుకుంటున్న మల్లిఖార్జున రావును వెండితెరకు తెచ్చింది దివంగత మహానటుడు రావుగోపాలరావు. ఆయన ప్రోద్భలంతోనే ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆరోగ్యకరమైన కామెడీకి పూర్తి స్థాయి కథలు వేసిన వారిలో జంధ్యాలను ప్రథమంగా చెబుతాం.. ఆ తర్వాత వంశీయే అలాంటి కథలతో కడుపుబ్బా నవ్వించాడు. అలాంటి వంశీ సినిమాలతోనే మల్లిఖార్జునరావు బాగా ఫేమ్ అయ్యారు. వంశీ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ మల్లిఖార్జున రావు కనిపిస్తారు. అదే టైమ్ లో జంధ్యాల, ఇవివి, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారి సినిమాల్లోనూ ఆయన రెగ్యులర్ కమెడియన్ గా స్థానం సంపాదించుకున్నారు..

మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నా.. తొలినాళ్లలో ఆయనపై రావుగోపాలరావు ప్రభావం ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ముందుండే వారు మల్లిఖార్జునరావు.

మల్లిఖార్జున రావు రెండు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఉన్నా రాని అవార్డ్ చివర్లో రావడం విశేషం. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో ఆయన చేసిన పాత్రకు ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. అలాగే వీరి కాంబినేషన్ లో వచ్చిన బద్రిలోనూ అదిరిపోయే కామెడీ పండించాడు. సీఎం రికమెండేషన్ తో వచ్చానని చెప్పి.. ఇంగ్లీష్ ను తెలుగులో మాట్లాడుతూ.. దట్టా.. ఐ థింకు వాటో వాటు అంటూ బ్రహ్మానందంను కన్ఫ్యూజ్ చేసే సీన్స్ హిలేరియస్..


నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వలేకపోవడం రోగం.. అన్న జంధ్యాల మాటలను బట్టి చూస్తే.. భోగిలా ఎంతోమందిని నవ్వించిన యోగి మల్లిఖార్జున రావు. దాదాపు రెండున్నర దశాబ్ధాలకు పైగా తనదైన శైలిలో కితకితలు పెట్టిన మల్లిఖార్జునరావు.. చివరి శ్వాస వరకూ నటించి కళామతల్లికి ప్రియపుత్రుడని నిరూపించుకున్నారు.

ఇదీ.. బట్టల సత్యం మల్లిఖార్జున రావు స్పెషల్ ఫేవరెట్ ఫైవ్.. 

Tags:    

Similar News