ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమను హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌ను ఉద్దేశించి నటి సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. ఆ డైరెక్టర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు. తనను కూతురు అని పిలుస్తూనే చాలా నీచంగా ప్రవర్తించాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు కన్నాను.18 ఏళ్ల వయసులో తెలిసిన వారి ద్వారా మూవీ ఛాన్స్ వచ్చింది. డైరెక్టర్ నచ్చ జెప్పాడని ఇంట్లో వాళ్లు కూడా సరే అన్నారు. అయితే తొలి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. కొంత కాలానికి అతడు నాతో నీచంగా, అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన భార్య పక్కన లేనప్పుడల్లా నాపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఏడాది పాటు ఇలానే చేశాడు. ఆ డైరక్టర్ నన్ను సెక్స్ బానిసగా మార్చాడు. నా బాధను ఎవరితోనూ చెప్పలేక పోయాను”అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం సౌమ్య చెప్పలేదు. ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి వేధింపుల కేసులను ఇన్‌వెస్టిగేషన్ చేస్తున్న ప్రత్యేక బృందానికి మాత్రమే అతడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తానని చెప్పారు.