చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు డిజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ వచ్చేసింది సిద్ధు జొన్నలగడ్డకు. ఈ మూవీ సీక్వెల్ తోనూ బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధు.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కాస్ట్యూమర్ నీరజా కోన దర్శకురాలుగా పరిచయం అవుతున్న ‘తెలుసు కదా’, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ‘జాక్’అనే మూవీతో పాటు డిజే టిల్లు తర్వాత మరోసారి సితార బ్యానర్ లోనే కోహినూర్ అనే సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు సినిమాలు ఈ యేడాదే విడుదలవుతాయి. దీంతో లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సిద్ధార్థ్. అయితే ఆ దర్శకుడు కాస్త తేడా అనిపించుకున్నాడు. అంటే ఒకరితో కమిట్ అయి వేరే పెద్ద ఆఫర్ వస్తే ఇది వదులుకునే రకం అన్నమాట. తెలిసుకదా అతనెవరో. యస్ పరశురామ్.
కొన్నాళ్ల క్రితం నాగ చైతన్యతో సినిమాకు కమిట్ అయ్యాడు పరశురామ్. కానీ మహేష్ బాబుతో ఆఫర్ రాగానే చైతూ ప్రాజెక్ట్ ను వదిలేసుకున్నాడు. దీంతో ఎప్పుడూ కోపంగా కనిపించని చైతన్య కూడా పరశురామ్ టాపిక్ వస్తే అతని పేరు కూడా ఎత్తొద్దు అంటాడు. పోనీ మహేష్ బాబుతో ఏమైనా బ్లాక్ బస్టర్ తీశాడా అంటే అబౌ యావరేజ్ అనిపించుకున్న సర్కారువారి పాట చేశాడు. తర్వాత విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇస్తే అతనికి ద ఫ్యామిలీ మేన్ అంటూ బిగ్ డిజాస్టర్ ఇచ్చాడు. ద ఫ్యామిలీ మేన్ మూవీతో పరశురామ్ కథ ముగిసిందనే అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు సీన్ లోకి సిద్ధు ఎంటర్ అయ్యాడు.
త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. ఎప్పట్లానే ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మిస్తాడు అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తప్ప దిల్ రాజు కూడా ఈ మధ్య చాలా ఫ్లాపులే చూస్తున్నాడు.