Chiranjeevi : 27 మంది రైటర్స్ పనిచేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా
27 మంది రైటర్స్ పనిచేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా ఏంటో తెలుసా.. చరిత్రలో ఓ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన ఆ సినిమా కథే ఇది.;
ఇప్పుడంటే దర్శకులే కథలు రాసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు దర్శకులు కేవలం దర్శకత్వం మాత్రమే చూసుకునేవారు. వారి చుట్టూ కొందరు ఆస్థాన రచయితలు ఉండేవారు. ఆయా దర్శకుల ఇమేజ్ ను బట్టి వాళ్లుకథలు సిద్ధం చేసేవారు. అలా చూసుకున్నా ఒక్కో సినిమాకు ఒక్కరు లేదా ఇద్దర రచయితలు మాత్రమే పనిచేస్తారు. బట్ ఒక్క సినిమా కోసం.. ఒకే ఒక్క సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ పనిచేశారు. ఆ సినిమా ఏంటో తెలుసా..? జగదేకవీరుడు అతిలోక సుందరి. యస్.. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ మూవీ కోసం ఏకంగా 27 మంది రచయితలు పనిచేశారట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ స్వయంగా చెప్పడం విశేషం. ఓ రకంగా ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ రికార్డ్. ఒక్క మూవీ కోసం ఇంతమంది రచయితలు పనిచేయడం.. అందరి ఆలోచనను తనదిగా చేసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు ఓ మాయాజాలాన్ని సృష్టించడం అనేది ఒక అద్భుతం కాక మరేంటీ.
వైజయంతీ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించిన.. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ 1990 మే 9న విడుదలైంది. అది మండు వేసవి అయినా ఆంధ్రలో అకాల తుఫాన్ మొదలైన సమయం. ఓ వూళ్ళకు ఊళ్లే తుఫాన్ దాటికి వణికిపోతుంటే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలై విజయం సాధించడం అసాధ్యం అనే అనుకున్నారంతా. కానీ ఇక్కడ నిజంగానే అద్భుతం జరిగింది. అంత తుఫాన్ లోనూ సినిమా విడుదలైంది. మొదటి వారానికే అద్భుతం అన్న టాక్ వచ్చింది. అంతే.. తుఫాన్ ను సైతం లెక్క చేయకుండా జనం థియేటర్స్ కు క్యూ కట్టారు. కొన్ని చోట్ల థియేటర్స్ కురుస్తున్నా.. థియేటర్స్ లోకి నీళ్లు వచ్చినా ప్రొజెక్షన్ ఆగలేదు. జనం వెనక్కి తగ్గలేదు. చిరంజీవి మాస్ కు శ్రీదేవి సౌందర్యానికి ప్రేక్షకులు దాసోహం అన్నారు. ఇళయరాజా సంగీతం కేఎస్ ప్రకాష్, ఏ విన్సెంట్ సినిమాటోగ్రఫీ ఇప్పటికీ చెప్పుకునేంత గొప్పగా నిలిచిపోయాయి.
అలా అంత టఫ్ టైమ్స్ లోనూ ఈ మూవీ 15 కోట్లు వసూళ్లు సాధించి అప్పటికి హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఒక ఫిల్మ్ ఫేర్ తో పాటు ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగు సినిమా హిస్టరీలో ఓ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. రిలీజ్ అయ్యి పాతకేళ్లు కావొస్తున్నా.. ఇంకా శ్రీదేవి పారేసుకున్న ఉంగరం చిరంజీవి కొడుక్కి దొరికితేనో లేక శ్రీ దేవి కూతురికి దొరికితోనో చూడాలని కోట్లమంది అనుకుంటోన్న సినిమాగానూ జగదేకవీరుడు అతిలోకసుందరికి ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.