మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్నారు. ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు ప్రకటన విడుదల చేశారు. ‘మా ఈ నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ అందులో పేర్కొన్నారు. ప్రకాశ్-సైంధవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది. కాగా.. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట సంచలనం రేపుతోంది. వీరిద్దరు విడిపోతారని అభిమానులు అస్సలు ఊహించలేదు.
తమిళంలో యుగానికి ఒక్కడు, రాజా రాణి, ‘అసురన్’, ‘సురరై పోట్రు’( అకాశమే నీ హద్దు) లాంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు అందించిన జీవీ ప్రకాశ్.. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, ప్రభాస్ చిత్రం ‘డార్లింగ్’, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, రాజాధిరాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సంగీత దర్శకుడి నుంచి హీరోగా మారిన ఆయన 15 చిత్రాలకు పైనే ప్రధాన ప్రాతల్లో నటించారు.