Gangs Of Godavari: 'మేము గోదారోళ్ళం..తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం'
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. రఫ్ అండ్ మాస్ అవతార్ లో విశ్వక్ సేన్;
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుల్లో యువ నటుడు విశ్వక్ సేన్ ఒకడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నాడు. తాజాగా మరో సినిమాను ప్రకటించిన విశ్వక్ సేన్. మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ఆయన సితార బ్యానర్‌లో ఓ సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో విశ్వక్ సేన్ తన రఫ్ అండ్ మాస్ అవతార్ లో అదరగొట్టాడు. అంతే కాదు ఈ సినిమాకు ఇంతకుముందు తాత్కాలికంగా పెట్టిన 'VS11'ను రీప్లేస్ చేస్తూ.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా పూర్తిగా రఫ్ అండ్ సీరియస్ పొలిటికల్ టచ్‌తో సాగనుందని తెలుస్తోంది. విష్వక్ సేన్ ఇలాంటి పీరియాడిక్ సినిమా చేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలునే ఉన్నాయి. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. గ్లింప్స్ లో.. 'మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం' అంటూ విశ్వక్‌సేన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ మెప్పిస్తోంది. గోదావరి జిల్లాల నేపథ్యంలో రానుండడంతో ఈ సినిమాకు సంబంధించిన షూట్ చాలా రోజుల పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను కృష్ణ చైతన్య కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు.
విశ్వక్ సేన్ 11వ చిత్రంగా రాబోతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనువిందు చేయనున్నారు. ఆయన గ్రే పాత్ర పోషిస్తున్నారని, ఈ సినిమాలో ఆయన నటన ప్రశంసలు అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2023, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.