Yashika Aannand : బ్రతికి ఉన్నందుకు బాధ పడుతున్నాను.. పుట్టిన రోజు నాడు నటి ఆవేదన
బిగ్ బాస్ తమిళ మాజీ కంటెస్టెంట్ నటి యషికా ఆనంద్ తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ మరణంపై ఒక భావోద్వేగ లేఖను పంచుకుంది.;
Yashika Aannand : యషికా ఆనంద్ జూలై 25 న మహాబలిపురం సమీపంలో ఘోర కారు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటన కోలీవుడ్‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది, ఆమె స్నేహితురాలు పావని కూడా అదే కారులో ప్రయాణిస్తుండగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యషికాతో పాటు మరో ఇద్దరు స్నేహితులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోమవారం, యషిక శస్త్రచికిత్స తర్వాత ఐసియు నుండి సాధారణ వార్డుకు మార్చబడింది. మంగళవారం, మరణించిన తన స్నేహితురాలి కుటుంబానికి యషిక హృదయపూర్వక సంతాపం తెలిపింది. "నేను ఇప్పుడు ఏమి చేస్తున్నానో నేను నిజంగా చెప్పలేను! నేను బ్రతికి ఉన్నందుకు బాధపడుతున్నాను. తప్పు చేసిన దానిలా తల దించుకుంటున్నాను.
ఆ విషాద ప్రమాదం నుండి నన్ను కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా లేక నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు జీవితమంతా దేవుడిని నిందించాలా అని నాకు తెలియదు. ప్రతి సెకను పావనిని నేను నిజంగా మిస్ అవుతున్నాను. నువ్వు నన్ను క్షమించలేవని నాకు తెలుసు. నేను మీ కుటుంబాన్ని ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంచాను.
నేను ఎప్పటికీ అపరాధిని. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నువ్వు నా దగ్గరకు తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒకరోజు మీ కుటుంబం నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను. నీతో గడిపిన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
నా కోసం ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. నేను నిజంగా జీవించాలనుకోవడం లేదు కానీ మీరు నాకు జీవితం పట్ల ఆశలు కల్పిస్తున్నారు అని యషికా తన ఆవేదనను ఇన్‌స్టాలో పంచుకున్నారు. యషికా ఆనంద్ తన పుట్టినరోజును జరుపుకోవడం లేదని అభిమానులకు సందేశం పంపారు. మీరు కూడా జరపవద్దంటూ అభిమానులను అభ్యర్థించారు. యషికా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఒక పెద్ద టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్‌లో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయింది.