ప్రఖ్యాత పాప్ గాయని, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ (జెలో) ప్రతిష్ఠాత్మక అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ (ఏఎంఏ) కార్యక్రమానికి రిహార్సల్స్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. ఈ వార్త అభిమానులను కొంత ఆందోళనకు గురిచేసినప్పటికీ, తాను పూర్తిగా కోలుకున్నానని, మే 26న జరిగే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల జెన్నిఫర్ లోపెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, ముక్కుపై అయిన గాయాన్ని చూపుతూ, దానికి ఐస్‌తో కాపడం పెట్టుకుంటున్న ఫోటోలను షేర్ చేశారు. వారం రోజుల అనంతరం తాను పూర్తిగా కోలుకున్నానని, డాక్టర్ డైమండ్ చికిత్స అందించారని తెలిపారు. "వారం తర్వాత, చాలా ఐస్ వాడకం అనంతరం, నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను" అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. మే 26న లాస్ వెగాస్‌లోని బ్లూలైవ్ థియేటర్‌లో ఏఎంఏ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.