Kaikala Satyanarayana: యముడి పాత్రలో కైకాల.. పైకి గంభీరం లోన కారుణ్యం
Kaikala Satyanarayana: నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా పరకాయ ప్రవేశం చేయగల కైకాలకు.. యమధర్మరాజు అనే బ్రాండ్ వచ్చింది.;
Kaikala Satyanarayana: నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా పరకాయ ప్రవేశం చేయగల కైకాలకు.. యమధర్మరాజు అనే బ్రాండ్ వచ్చింది. యముడి క్యారెక్టర్ అంటే కైకాల మాత్రమేననే ప్రత్యేక ముద్ర పడింది. ఆ నరకాధిపతి ఎలా ఉంటాడో తెలీదు గాని.. యమగోల చూసిన తరువాత ఓహో యముడంటే ఇలా ఉంటాడా అని జనం ఫిక్స్ అయిపోయారు. అసలు యముడు కూడా మన కైకాల సత్యనారాయణలాగే ఉంటాడేమో అనిపించేంతలా తనదైన బ్రాండ్ సృష్టించారు. అంతలా యుముడి వేషంలో జీవించేశారు కైకాల. ఆ తరువాత యముడి వేషం ఎవరు వేసినా అంతగా మెప్పించలేకపోయారు. కేవలం కైకాల సత్యనారాయణకు మాత్రమే యముడి వేషం సూట్ అయింది.
యముండ, ధూంతథ అనే పదాలతో.. యముడంటే ఇంత గంభీరంగా ఉంటాడు కాబోలు అనిపించారు. యమగోలలో గోల చేసినా, యమలీలలో ఆ లీలలు చూపినా.. అదంతా కైకాల సత్యనారాయణకే చెల్లింది. కృష్ణుడంటే ఎన్టీఆర్, యముడంటే కైకాల అని తెలుగు ప్రజలు ఆ ముద్రను తమ మదిలో ముద్రించేసుకున్నారు. మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంతగా తన మార్క్ చూపించారు కైకాల సత్యనారాయణ.
సహజంగా యముడు అన్న పదాన్ని ఉచ్చరించడానికే భయపడతారు. యమలోకాన్ని అసలు తలచుకునే వాళ్లే ఉండరు. మరణం, నరకం అనే పదాలను దరిదాపుల్లోకి కూడా రానివ్వని సమాజం మనది. అలాంటిది యమలోకాన్ని దగ్గర చేసిన నటుడు కైకాల సత్యనారాయణ. అప్పటి వరకు యమధర్మరాజు, నరకంపై ఉన్న అభిప్రాయాన్ని, ఆ భయాన్ని పోగొట్టారంటే ఆ క్రెడిట్ మొత్తం కైకాల సత్యనారాయణదే. యముడు పైకి గంభీరం కనిపించినా.. లోలోన మాత్రం ఆ కారుణ్యం ఉంటుందేమో అనిపించేలా అందరి మనసులలో ఓ ముద్ర వేశారు. బహుశా అసలైన నరకాధిపతి అలా ఉంటారో ఉండరో తెలియదు గానీ.. యముడిపై సహజంగా ఉండే భయాన్ని మాత్రం తన నటనతో పోగొట్టారు కైకాల సత్యనారాయణ.
ఇక ఘటోత్కచుడు అనగానే వివాహభోజనంబు అనే పాటలోని ఎస్వీఆర్ మాత్రమే కళ్లముందు కనిపించేవారు. ఎస్వీఆర్‌ను అలా చూసిన వాళ్లు మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేరు. కాని, ఘటోత్కచుడు సినిమాలో ఆ పాత్ర చేసిన తరువాత.. కైకాలను జనం యాక్సెప్ట్ చేశారంటే ఎంత గొప్పగా ఆ పాత్రలో ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఘటోత్కచుని వీరత్వం, ఔదార్యం, రౌద్రం ఇలా ఉంటాయా అని తెలుగు ప్రజలు ఒక ఊహాలోకాన్ని సృష్టించుకున్నారు. అంతలా ఓ బ్రాండింగ్ సృష్టించారు కైకాల సత్యనారాయణ.
భువి మీదున్న యముడు తన లోకంలోకి వస్తే.. ఇక తానెక్కడికి పోవాలి అనుకున్నాడో ఏమో.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యముడు కైకాల జోలికిపోలేదు. యముడంటే కైకాలనే అనే మనుషుల మాటలు నరకాధిపతి చెవిన కూడా పడ్డాయో.. మనిషి రూపంలో ఉన్న యముడిని తన లోకానికి రప్పించుకోవాలనుకున్నాడో గాని.. ఇప్పుడిలా హఠాత్తుగా తీసుకెళ్లిపోయారు. బహుశా యమపాశం, యమకింకరులను పంపించకుండా.. స్వయంగా యముడే వచ్చి కైకాలను తీసుకెళ్లిపోయాడా అని మాట్లాడుకుంటున్నారు.