భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ( Kiran Bedi ) బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. దీనికి ‘బేడీ: ది నేమ్ యు నో, ది స్టోరీ యు డోంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కుషాల్ చావ్లా దర్శకత్వం వహిస్తుండగా, గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘ఇది భారత్‌లో పెరిగి, చదువుకొని దేశ ప్రజల కోసం పనిచేసిన ప్రతి స్త్రీ కథ’ అని బేడీ ఓ ప్రకటనలో తెలిపారు.
‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు.