పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాక అప్పుడప్పుడూ పాటలతోనూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా జానపదాలు పాడటం అంటే పవన్ కు చాలా ఇష్టం. తమ్ముడు, ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, పంజా,అత్తారింటికి దారేదీ, అజ్నాత వాసి వంటి చిత్రాల్లో తనదైన శైలిలో పాటలతో ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి హరిహర వీరమల్లు కోసం గొంతు సవరించుకున్నాడు పవన్. అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం ఈ సారి అన్ని భాషల్లోనూ తనే పాడాడు పవన్ కళ్యాణ్. ఓ స్టార్ హీరో ఇన్ని భాషల్లో పాటలు పాడటం మాత్రం రికార్డ్ అనే చెప్పాలి. ఈ మార్చి 27న విడుదల కాబోతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. జ్యోతికృష్ణ - క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి అనే పాట విడుదల చేశారు.
పవన్ పాటంటే ఖచ్చితంగా జానపదంతోనూ సాధికారికంగానూ కనిపిస్తుంది. అదే మరోసారి ఈ మాట వినాలిలో కనిపించింది. ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడనీ, ఔరంగజేబుతో తలపడే యోధుడుగా కనిపిస్తాడని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా తన ముఠాతో కలిసి ఒక చోట మకాం వేసిన వీరమల్లు ఆ గుంపులోని కొందరిని ఉద్దేశిస్తూ.. చెప్పే మాటలనే పాటగా మలిచారు.
ఈ పాటను తనకే సాధ్యమైన రీతిలో ఈతమాను ఇల్లుగాదు, తాటిమాను తావుగాదు, తగిలినోడు మొడుగు కాదు, తగరము బంగారంగాదు.. అందుకే గురుడా మాట వినాలి అంటూ సామెతలు, జానపదాలను మిక్స్ చేసి రాశాడు పెంచలదాస్.ఆకులేని అడవిలోనా మేకలన్ని మేయవచ్చు.. సద్దులేని కోనలోనా కొండచరియ కూలావచ్చు మాట దాటిపోతే.. మర్మము తెలియకపోతే.. పొగరుపోతు తగురుపోయి కొండను తాకినట్టూ అంటూ అదే టీమ్ లోని కొందరికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగానూ కనిపిస్తుందీ సాంగ్.
మొత్తంగా పవన్ కళ్యాణ్ గొంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. ఇక సినిమాను కూడా చెప్పిన టైమ్ కు విడుదల చేస్తే ఈ వేసవికి బాక్సాఫీస్ మొత్తం వీరమల్లుని సొత్తు అయిపోతుంది.