Mirzapur Actor Asif Khan : గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మీర్జాపూర్ నటుడు
ప్రముఖ వెబ్‌సిరీస్ మీర్జాపూర్ లో నటించిన నటుడు ఆసిఫ్ ఖాన్ ఇటీవల గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని తెలిసింది. ఆసిఫ్ ఖాన్‌కు సోమవారం సాయంత్రం (జూలై 14) గుండెపోటు రావడంతో వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఆసిఫ్ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ప్రమాదం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఆసిఫ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేసి, తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకు తెలిపారు. "గడిచిన కొన్ని గంటలుగా నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. ఇవి ఆసుపత్రిలో చేరడానికి కారణమయ్యాయి. ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. బాగానే ఉన్నాను. మీ అందరి ప్రేమ, ఆప్యాయతకు నేను కృతజ్ఞుడిని. మీ అభిమానం నాకు చాలా ముఖ్యం. నేను త్వరలోనే తిరిగి వస్తాను," అని ఆయన రాశారు. ఆసిఫ్ ఖాన్ "మీర్జాపూర్"తో పాటు "పాటల్ లోక్", "పంచాయత్" వంటి హిట్ వెబ్‌సిరీస్‌లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.