టాలీవుడ్ కు సమ్మర్ వెరీ వెరీ స్పెషల్ సీజన్. స్టార్ హీరోల మూవీస్ తో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ రెండేళ్లుగా ఆ కళ తప్పింది. స్టార్ హీరోల సినిమాలేం రావడం లేదు. టైర్ టూ హీరోలు వస్తున్నారు. కానీ ఎవరూ పెద్ద విజయాలు సాధించడం లేదు. ఇక ఈ సమ్మర్ మరీ దారుణం కేవలం రెండు చిన్న సినిమాలే హిట్ అనిపించుకున్నాయి. అన్నీ ఫ్లాపులే. ఆ ఫ్లాపులు దాటించేందుకు వస్తున్నాడు నాని. హిట్ 3తో టాలీవుడ్ కు ఈ సమ్మర్ లో ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వడం గ్యారెంటీ అనిపించేలా ఉన్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. నాని ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ అయినా కమర్షియల్ గా బిగ్ హిట్ కాబోతోందనిపించేలా ఉన్నాయి వైబ్స్. సో.. ఈ మూవీ విజయంతో టాలీవుడ్ కు ఈ సమ్మర్ లో ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చే టార్గెట్ ను ఛేదించబోతున్నాడు నాని అంటున్నారు.
ఇక మనలాగే కోలీవుడ్ పరిస్థితి కూడా ఈ సమ్మర్ లో ఏమంత బాలేదు. అక్కడా స్టార్ హీరోల సినిమాలు లేవు. విక్రమ్ వీరధీర శూరన్ ఓ మోస్తరుగా ఆడినా అది బ్లాక్ బస్టర్ అనలేం. స్టార్స్ ఎవరూ సమ్మర్ రేస్ లో లేరు. ఈటైమ్ లో రెట్రోతో వస్తున్నాడు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో సూర్య కూడా కోలీవుడ్ కు ఓ బ్లాక్ బస్టర్ అందించే టార్గెట్ తో కనిపిస్తున్నాడు. కాకపోతే అతనే ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. రెట్రో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఒకే మూవీతో రెండు సక్సెస్ లు వస్తాయి. ఒకటి సూర్యకు, రెండోది కోలీవుడ్ కు. మరి ఈ టార్గెట్ ను సూర్య ఛేదిస్తాడా అనేదే పాయింట్.
మనకంటే దారుణంగా ఇబ్బంది పడుతోంది బాలీవుడ్. సరైన విజయాలు లేక నానా తంటాలు పడుతోంది బాలీవుడ్. సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరో సికందర్ తో బరిలో నిలిచినా డిజాస్టరే ఎదురైంది. కొంతలో కొంత జాట్ తో సీనియర్ హీరో సన్నీడియోల్ హిట్ కొట్టాడు. కానీ అది సరిపోదు. 2018లో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్ తో రైడ్ 2 అంటూ వస్తున్నాడు అజయ్ దేవ్ గణ్. ఇదీ ఈ గురువారమే విడుదలవుతోంది. చాలా రోజుల తర్వాత సికందర్ కు మించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ మూవీకి కనిపిస్తున్నాయి. ట్రైలర్ బావుంది. రితేష్ దేశ్ ముఖ్ విలనీ ఆకట్టుకునేలా ఉంది. రైడ్ టెంప్లేట్ లోనే వస్తున్నా.. ఈ సారి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మరి. మొత్తంగా అజయ్ దేవ్ గణ్ కూడా సొంతంగా హిట్ కొట్టాలి. బాలీవుడ్ కూ హిట్ ఇవ్వాలి.
అదీ విషయం.. తెలుగు నుంచి హిట్ 3తో నాని, రెట్రోతో సూర్య కోలీవుడ్ కు, రైడ్ 2తో అజయ్ దేవ్ గణ్ బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చే టార్గెట్ తో వస్తున్నారు. మరి ఈ ముగ్గురులో ఆ టార్గెట్ కు పక్కాగా ఛేదించి బాక్సాఫీస్ ను షేక్ చేసే బాద్ షా ఎవరనేది ఓ 24 గంటల్లో తేలిపోతుంది.